గుడివాడ గెలిచి తీరాల్సిందే...ఆయనకే టీడీపీ టికెట్...?
కొడాలి నానికి ఓటమి రుచి ఏంటో చూపించాలని ఏకంగా చంద్రబాబు లోకేష్ గట్టిగా ప్రతిన పూనారు.
గుడివాడ ఇపుడు టీడీపీకి అసలైన సవాల్ గా మారింది. తమ పార్టీలో పుట్టి రాజకీయంగా ఎదిగి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీలో చేరి తమను దారుణంగా విమర్శించడం టీడీపీ అధినాయకత్వం సహించలేకపోతోంది. కొడాలి నానికి ఓటమి రుచి ఏంటో చూపించాలని ఏకంగా చంద్రబాబు లోకేష్ గట్టిగా ప్రతిన పూనారు.
గుడివాడ గెలుపు తెలుగుదేశానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది అనడంతో సందేహం లేదు. రేపటి ఎన్నికల్లో ఏపీ అంతా టీడీపీ గెలిచినా గుడివాడ కొడాలి నాని గెలిస్తే ఆ విజయం ఏ మాత్రం కిక్ ఇవ్వదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది. అందుకే గుడివాడలో కొడాలి నానికి ఓడించి తీరాలన్న గట్టి పట్టుదలతో హై కమాండ్ ఉంది.
ఇది ఎక్కడా దాచుకోవడంలేదు. తన మనసులో మాటను చంద్రబాబు పదే పదే బయటకు చెప్పడం ద్వారా క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తున్నారు. వారిలోనూ పట్టుదలను పెంచుతున్నారు. గుడివాడని గెలిచి తీరాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. తాజాగా గుడివాడ విషయంలో చంద్రబాబు ఆ నియోజకవర్గం క్యాడర్ కి నాయకులకు బిగ్ టాస్క్ ఇచ్చేశారు.
గుడివాడలో టికెట్ ఇచ్చేది కూడా ఎవరికో ఇండైరెక్ట్ గా చెప్పేశారు అని అంటున్నారు. కష్టపడి పనిచేసే వారికే గుడివాడ టికెట్ అని బాబు క్లారిటీ ఇచ్చారు. ఇక గుడివాడలో టీడీపీ గెలుపు కోసం ఈ రోజు నుంచి కార్యకర్తలు అంతా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. పార్టీ కోసం ఎవరెవరు ఎంత వరకూ కష్టపడుతున్నారో తన దగ్గర మొత్తం డేటా ఉందని కూడా బాబు అంటున్నారు.
ఎన్నారై వెనిగెళ్ల రాముకి గుడివాడ టికెట్ ని చంద్రబాబు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆయనకు అంగబలం అర్ధ బలం తో పాటు సామాజిక సమీకరణలు కూడా పెద్ద ఎత్తున కలసి వస్తాయని భావిస్తున్నారు. అలాగే తాజా ఫేస్ గా కూడా ఉంటుందని అంటున్నారు. ఇక గుడివాడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీగా కీలక పదవి ఇచ్చి గౌరవిస్తామని అధినాయకత్వం నచ్చచెబుతున్నట్లుగా తెలుస్తోంది.
అటు రావి ఇటు వెనిగండ్ల రాంబాబు కలిస్తే సులువుగా కొడాలి నానికి ఓడించవచ్చు అన్నది పార్టీ ఆలోచనగా ఉంది. అయితే రావి కూడా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఆయన 2000లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా నెగ్గారు. అది లగాయితూ పాతికెళ్ళుగా ఆయన మళ్లీ ఎమ్మెల్యే కాలేకపోయారు. అయితే పార్టీ పట్ల విధేయతతో ఉంటూ వస్తున్నారు.
ఆయనకు 2004లో టికెట్ ఇవ్వకుండా కొడాలికి ఇచ్చారు. దాంతో ఆయన 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి 28 వేల ఓట్లు సాధించారు. కొడాలి టీడీపీ వదిలిన తరువాత 2014లో ఆయనకు రెండవసారి టికెట్ దక్కింది. 2019లో దేవినేని అవినాష్ కి టికెట్ ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. ఇపుడు వెనిగండ్ల రాంబాబుని తెస్తోంది. అయితే మొదటి నుంచి గుడివాడలో ఉంటూ పార్టీ కోసం కష్ట[పడుతున్న రావికే టికెట్ ఇవ్వడం సబబు అని ఆయన వర్గం అంటోంది.
కానీ చంద్రబాబు మాత్రం వెనిగండ్ల రాంబాబు వైపే మొగ్గు చూపుస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చినా పార్టీలో అంతా కలసి ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంత అనుకున్నా కొడాలి నాని స్ట్రాంగ్ అభ్యర్ధి అని చెప్పాలి. ఆయనకు లోకల్ గా మంచి పట్టు ఉంది. ఆయన్ని ఓడించాలన్నది టీడీపీ పంతం అయితే ఆ దిశగా వ్యూహాలు కూడా పటిష్టంగా ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ అధినాయకత్వం ఇపుడు గుడివాడ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది కాబట్టి ఈసారి గుడివాడ ఏపీ రాజకీయాల్లో కాక రేపే అవకాశాలు చాలా అధికాంగా ఉన్నాయని చెప్పక తప్పదు.