టీడీపీ ఐవీఆర్ ఎస్ సర్వే.. లెక్కలు మారిపోతున్నాయ్!
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఐవీఆర్ ఎస్ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో చిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఐవీఆర్ ఎస్ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో చిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో సీనియర్ల వ్యవహారం ఆసక్తిగా మారింది. సర్వేలో అనుకూల ఫలితాలు వస్తే ఓకే..లేకుంటే టిక్కెట్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. కొంత మంది నేతలకు స్థానచలనం తప్పదని మరోసారి స్పష్టతనిస్తున్నారు. ఇక, ఈ ఐవీఆర్ ఎస్ సర్వేలో పెనమలూరు నుంచి దేవినేని ఉమా మహేశ్వరరావునునిలబెడుతున్నామని చంద్రబాబు ఇక్కడి ప్రజలకు తెలిపారు.
దీనిపై వారి నుంచి అభిప్రాయాలను స్వయంగా ఆయన సేకరించారు. దీనిలో పెనమలూరు ప్రజలు దేవినేనికి జై కొట్టారని అంటున్నారు. వాస్తవానికి కృష్నాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేనికి అన్ని నియోజకవర్గాల్లోనూ పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన్ను అధినేత పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి దేవినేని ఉమ పేరిట పెనమలూరు నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. దీనిలో ఆయనకు మంచి మార్కులే పడుతున్నాయని సమాచారం.
ఇక, తొలి జాబితాలో చోటు దక్కని మరో కీలక నేత గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఈయనకు కూడా వేరే చోట ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక్కడ నుంచి వైసీపీ నాయకుడు, ఇటీవల సీఎం జగన్‌పై విమర్శలు చేసిన జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గురజాల ఆశిస్తున్న యరపతినేనికి నరసరావుపేట టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నరసరావుపేటలో కూడా.. ఐవీఆర్ ఎస్ సర్వే చేస్తోంది. తెలుగుదేశానికి మంచి పట్టున్న స్థానం కావడంతో...గతంలో కోడెల శివప్రసాదరావు పలుమార్లు ఇక్కడి నుంచి నెగ్గారు. అదే దూకుడు కనబరిచే యరపతినేని అయితే ఖచ్చితంగా నెగ్గుకురాగలమని భావించిన చంద్రబాబు ఇక్కడ నుంచి యరపతినేని(కమ్మ)కి అవకాశం ఇవ్వాలని భావిస్తుండడం గమనార్హం.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా శ్రీనివాసులరెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే సాగుతోంది. వైసీపీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి.. సర్వేపల్లి, ఆత్మకూరులో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ప్రజలు ఆయనను ఎక్కువగా కోరుకుంటే అక్కడ చంద్రబాబు అవకాశం ఇస్తారని సమాచారం.
ఇక, కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఆయన స్తానంలో మహిళ కోటాలో ఆయన కుమార్తెను రంగంలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్కడ కూడా ఐవీఆర్ ఎస్ పేరుతో సర్వే చేస్తున్నారు. దీనిలో వచ్చే ఫలితం ఆధారంగా టికెట్లను కేటాయించనున్నారు.