టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ ఆలస్యం... ఇదేనా అసలు కారణం?
అవును... కారణం ఏదైనప్పటికీ టీడీపీ - జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను నియమించేసింది. ప్రస్తుతం ఐదో లిస్ట్ పై కసరత్తులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఈ దఫా కూటమిగా బరిలోకి దిగబోతున్న టీడీపీ-జనసేనలు మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తుంది!
అవును... కారణం ఏదైనప్పటికీ టీడీపీ - జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఒక కొలిక్కి వచ్చిందని అంటున్నా.. ఇంకా ఆ విషయంలో స్పష్టత రాలేదనే వాదన కూడా తనదునుగుణంగా బలంగా వినిపిస్తుంది. కొన్ని కీలకమైన నియోజకవర్గాల విషయంలో పవన్ - చంద్రబాబుల మధ్య ఇంకా అంగీకారం రాలేదని అంటున్నారు.
ఈ సమయంలో పలువురు సీనియర్లు త్యాగాలు చేయడం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... వారు రెబల్స్ గా మారితే మొదటికే మోసం వస్తుందనే చర్చ మొదలైంది. ఈ కారణంతోనే ఇంకా నాన్చుడు దోరణిలోనే చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఫలితంగా... సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చే అవకాసం ఉందని, చివరి నిమిషం వరకూ ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తే అసంతృప్తులను బుజ్జగించడం తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు.
మరోపక్క... టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఆలస్యానికి బీజేపీ కోసం వేచి చూడటం కూడా ఒక కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ బిజీలో ఉన్న బీజేపీ పెద్దల నిర్ణయాల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న బాబు & కో... మరికొన్ని రోజులు అదేపనిలో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలా వేచి చూసిన అనంతరం బీజేపీ నిర్ణయం తర్వాత అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేసి ప్రకటించాలని చూస్తున్నరని సమాచారం.
దీంతో... గతంలో లాగా చివరి నిమిషం వరకూ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే పరిణామాలు తీవ్ర ఫలితాలిచ్చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. చివరి వరకూ ఊరించి, ఆనాకా ఉసూరుమనిపిస్తే అది ప్రత్యర్థులకు కొండంతబలంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్నో కొన్ని సీట్లను అయినా ప్రకటించేస్తే... ఆ అభ్యర్థులు వారి వారి పనుల్లో వారు బిజీగా ఉండటంతో పాటు.. టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న జనసేన నేతలకూ క్లారిటీ వచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి కొన్ని రోజుల క్రితం 70 మందితో కూడిన టీడీపీ తొలిజాబితా విడుదలవ్వబోతుందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో జనసేనకు కేటాయించబోతున్నారనే ఊహాగాణాలున్న నియోజకవర్గాల పేర్లు కనిపించలేదు! దీంతో... ఇదే తొలిజాబితా అయ్యి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపించింది. మరి ఈ విషయంలో టీడీపీ - జనసేనలతో బీజేపీ దోస్తీ చేస్తుందా లేదా అనే విషయాలపైనే తొలిజాబితా ఎప్పుడు అనే విషయం ఆధారపడి ఉందని భావించాలి!!