టీడీపీ జనసేనలకు వచ్చే సీట్లు అవేనట...!

జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం కాదు, ఆ రెండు పార్టీలకు కలిపి పావలా అంటే ఇరవై అయిదు సీట్లు మాత్రం వస్తాయని కొడాలి కౌంటరేశారు.

Update: 2023-10-06 13:39 GMT

ఏపీలో 2024లో ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వారాహి యాత్ర సందర్భంగా రాబోయేది తమ ప్రభుత్వమే అన్నారు. వైసీపీ సర్కార్ ని రూపాయి పావలా ప్రభుత్వం అన్నారు.

ఇలా పవన్ పంచులేస్తూ గత నాలుగు రోజులుగా అధికార పార్టీ మీద గట్టిగానే గర్జించారు. దానికి మాజీ మంత్రి కొడాలి నాని సెటైరికల్ గానే రిప్లై ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని పవన్ చెప్పారని అందుకే రూపాయి పావలా అని ఆయన అంటున్నారు అని వెటకరించారు.

పవన్ మనసులో కూడా వైసీపీ గెలుస్తుందని తెలుసు అని ఆయన రూపాయి పావలా లెక్కల వెనక విషయం అదే అన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం కాదు, ఆ రెండు పార్టీలకు కలిపి పావలా అంటే ఇరవై అయిదు సీట్లు మాత్రం వస్తాయని కొడాలి కౌంటరేశారు. పవన్ కళ్యాణ్ స్పీచుల గురించి తమ ప్రభుత్వం మీద హెచ్చరికల గురించి ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

కరిచే కుక్క మొరగదని, మొరిగే కుక్క కరవని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని అన్నారు. ఆయన కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒక్కటే అని కొడాలి పంచులు పేల్చారు. లోకేష్ చంద్రబాబు తప్పు చేయలేదని ఎవరూ అనరని కూడా ఆయన అంటున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ వారాహి నాలుగవ విడత యాత్రలో వైసీపీ సర్కార్ మీద చేసిన విమర్శలకు సరైన తీరులో బదులిచ్చారు కొడాలి నాని. వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. ఆ విషయం తెలిసే కిందా మీద అవుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక మరో మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ ని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ తయారుగా ఉన్నారని అన్నారు. ఒక వైపు టీడీపీ పని అయిపోయింది వీక్ గా ఉంది అని పవన్ స్వయంగా చెబుతూంటే తమకు చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతీ పెరిగిందని టీడీపీ వారు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా మళ్లీ వైసీపీదే విజయం అని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేసేది లేదని అన్నారు. తప్పు చేసి జైలుకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తిరిగి రాజకీయంగా కోలుకోలేదని అంబటి రాంబాబు అంటున్నారు.

పొరుగున ఉన్న జయలలిత కూడా జైలు నుంచి వచ్చారని చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని అందులో ఎక్కాలని ఎవరూ అనుకోరని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News