చంద్రబాబు ఫోటోలకు నిప్పులు... టీడీపీ లిమిటెడ్ కంపెనీ అంటూ కామెంట్లు!
టిక్కెట్లు అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. టీడీపీలో కష్టపడినవారికి విలువ లేదంటూ... చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలను తగలబెడుతున్నారు.
ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఆయా పార్టీలో చెలరేగుతున్న అసమ్మతి సెగలు మాత్రం మొదటికే మోసం తెచ్చే స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో కొంతమంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై బహిరంగంగా ఫైర్ అవుతుంటే... ఇంకొంతమంది మాత్రం నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నారని, తమకు టిక్కెట్ల విషయంలో ఇచ్చిన షాకే కు రిటన్ గిఫ్ట్ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అంటున్నారు.
ఈ సమయంలో ఇప్పటికే ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల రెండు జాబితాల అనంతరం పలు నియోజకవర్గాల్లో కేడర్ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ సెగలు ఇప్పట్లో తగ్గేలా లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల అవ్వడంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ రగిలిపోతున్నారు. టిక్కెట్లు అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. టీడీపీలో కష్టపడినవారికి విలువ లేదంటూ... చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలను తగలబెడుతున్నారు.
అనంత అర్బన్ లో భగ్గుమన్న తమ్ముళ్లు!:
అవును... చంద్రబాబు శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల తుది జాబితాతో ఒక్కసారిగా అసంతృప్త సెగలు భగ్గుమన్నాయి. ఇందులో భాగంగా అనంతపురం అర్బన్ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాజాగా ప్రకటించిన తుది జాబితాలో తనకు కాకుండా... దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టిక్కెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి అనుచరులు సెగలు కక్కారు! ఒక్కసారిగా రగిలిపోయారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఈ సందర్భంగా మైకులముందుకు వచ్చిన ప్రభాకర్ చౌదరి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పిలిచినా వెళ్లేది లేదు: ప్రభాకర్ చౌదరి!
ఇందులో భాగంగా... డబ్బున్న వారికి టీడీపీ అమ్ముడుపోయిందని.. డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు ప్రభాకర్ చౌదరి. ఇదే సమయంలో... తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకుని, కష్టపడి పని చేశామని.. అటువంటి తనకు కాకుండా... దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టిక్కెట్ ఇచ్చారంటూ ప్రభాకర్ చౌదరి నిప్పులు కక్కారు! టీడీపీ ఓ లిమిటెడ్ కంపెనీలా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు!
ఇదే సమయంలో... నియోజకవర్గంలో ఎవరిని అడిగి చంద్రబాబు.. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టిక్కెట్ ఇచ్చారు.. ఆయన ఏమైనా గాంధీ వారసుడా.. ఏ ప్రాతిపదికన అతనికి టిక్కెట్ ఇచ్చారు.. అంటూ చంద్రబాబుపై ఫైర్ ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ పరిస్థితుల్లో తనను చంద్రబాబు పిలిచినా కూడా వెళ్లేది లేదని.. అనుచరులతో మాట్లాడి తన భవిష్యత్ కార్యచరణను శనివారం ప్రకటిస్తానని ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఇదే సమయంలో తనతోపాటు జిల్లాలో చాలా మందికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చీపురుపల్లి ఎఫెక్ట్... కిమిడి నాగార్జున రాజీనామా!:
మరోపక్క టీడీపీ కీలక నేత కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. చీపురుపల్లి టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... విజయనగర జిల్లా అధ్యక్ష పదవితో పాటు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అంతకంటే ముందు... పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపిన నాగార్జున అనుచరులు... కళా వద్దు.. నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేశారు.
రగిలిపోతున్న జితేందర్ గౌడ్ వర్గీయులు!:
ఇదే సమయంలో... అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టిక్కెట్ గుమ్మనూరు జయరాంకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు భగ్గుమన్నారు. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసు వద్ద ఉన్న చంద్రబాబు, లోకేష్ ల ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్, కంప్యూటర్లను బద్దలు కొట్టారు! ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీకోసం కష్టపడినవారికి టిక్కెట్ ఇవ్వకుండా... వలస నేతలకు రూ.50 కోట్లకు టిక్కెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
నెల్లిమర్ల, కావలి, గుంతకల్ లలో ఇదే పరిస్థితి!:
ఇదే క్రమంలో... నెల్లిమర్ల టిక్కెట్ జనసేనకు కేటాయించడంపై అక్కడ టీడీపీ కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. నెల్లిమర్ల ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకి తీరనిద్రోహం చేశారంటూ పోలిపల్లిలో కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు!
ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే... కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి... టీడీపీకి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. చంద్రబాబుకి లేఖ రాశారు.
ఇదే సమయంలో గంతకల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడిపై నిప్పులు చేరిగారు. ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు 150 కోట్ల రూపాయలు తీసుకుని నియోజకవర్గ నాయకులకు కాకుండా.. పక్క నియోజకవర్గ నాయకులకు టిక్కెట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా... చంద్రబాబు ఫోటోని మంటల్లో వేసి కాల్చారు!
ఇలా ఇంతకాలం నియోజకవర్గంలో కష్టపడిన వారికి కాకుండా.. వలస నేతలకు, డబ్బున్న వారికి టిక్కెట్లు ఇచ్చారంటూ కార్యకర్తలు పలు నియోజకవర్గాల్లో నిప్పులు చెరుగుతున్నారు. ఇదే క్రమంలో.. అనపర్తి నియోజకవర్గం కూడా కాకరేపుతున్న తరుణంలో.. మరో రెండు మూడు రోజుల్లో ఈ నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే! దీంతో ఈ నియోజకవర్గాలను ఎన్నికలు జరగకముందే ఫలితాలు వచ్చే స్థానాల ఖాతాల్లో వేయొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!