కొత్త బంధం : టీడీపీ రాధా జనసేన ఇంటి అల్లుడుగా...!

వంగవీటి రంగా ఏకైక రాజకీయ వారసుడు వంగవీటి రాధాక్రిష్ణ ఓ ఇంటి వారు అవుతున్నారు.

Update: 2023-09-03 14:00 GMT

వంగవీటి రంగా ఏకైక రాజకీయ వారసుడు వంగవీటి రాధాక్రిష్ణ ఓ ఇంటి వారు అవుతున్నారు. ఆయన నర్సాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకుడి కుమార్తెను వివాహమాడనున్నారు. దీనికి సంబంధించి ఆదివారం రాధా నిశ్చితార్ధం జరిగింది.అక్టోబర్ 22న రాధా వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే రాధా నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిని వివాహం చేసుకోనున్నారు. అత్తమామలు ఇద్దరూ రాజకీయంగా కీలకంగా నర్సాపురంలో ఉన్నా వారే. రాధా అత్త అమ్మానీ టీడీపీలో 1987లో మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఇక బాబ్జీ కూడా టీడీపీ నేతగా చాలా కాలం ఉన్నారు. ఆయన కొంతకాలం హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ ఉంది ఈ మధ్యనే వచ్చారు.

ఆయన నర్సాపురం జనసేన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్యన వారాహి యాత్ర పశ్చిమ గోదావరిలో చేపట్టినపుడు ఆయన ఇంట్లోనే బస చేశారు. ఆ సమయంలోనే బాబ్జీ రెండవ కుమార్తె పుష్పవల్లి వివాహం ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. ఇక వంగవీటి రాధాతో ఈ వివాహానికి జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు కూడా మధ్యవర్తిత్వం వహించారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీలో కీలక నేతగా విజయవాడ రాజకీయాలలో ఉన్న రాధాక్రిష్ణ జనసేనతో వియ్యం అందుకుంటున్నారు. పెళ్లి తరువాత ఆయన జనసేన తరఫున పోటీ చేస్తారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఎందుకంటే ఆయన కోరుకున్న విజయవాడ సెంట్రల్ సీటు టీడీపీలో దక్కేలా కనిపించడంలేదు. అయినా సరే ఆయన నారా లోకేష్ విజయవాడ పాదయాత్రకు వచ్చినపుడు ఆయన వెంట ఉన్నారు పాదయాత్రలో కలసి అడుగులు వేశారు.

ఏకాంతంగా ఆయన లోకేష్ తో తన మనసులోని మాటను చెప్పుకున్నారని అంటున్నారు. మరి టీడీపీలో ఆయనకు సెంట్రల్ సీటు దక్కుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటున్న నేపధ్యంలో రాధా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని అంటున్నారు. మొత్తానికి జనసేన టీడీపీ పొత్తుల కంటే ముందు టీడీపీ నేత హోదాలో రాధా జనసేన నేతతో వియ్యం అందుకుని కొత్త బంధం కలిపారు. దీని రాజకీయ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News