చంద్రబాబుకు ఎంపీ కేశినేని సర్టిఫికెట్.. విషయం ఏంటంటే!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సర్టిఫికెట్ ఇవ్వడం.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సర్టిఫికెట్ ఇవ్వడం.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేశినేని నాని.. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి, ఆయన నిజాయితీ గురించి మాట్లాడారు. అంతేకాదు.. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కొన్ని మలుపులు చోటు చేసుకున్న విధానాలను కూడా ఆ యన వివరించారు.
దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో నారా చంద్రబాబు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. అయితే.. కొందరు మచ్చలు అతికించేందుకు ప్రయత్నించారని.. కానీ, సాధ్యం కాలేదని అన్నారు. తాజాగా ఇటీవల రూ.118 కోట్లకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమేనని నాని వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై తాను ఏమీ చెప్పబోనన్నారు.
ఐటీ నోటీసులు, అనంతర పరిణామాలపై చంద్రబాబే సమయం వచ్చినప్పుడు సమాధానమిస్తారని నాని అన్నారు. రాష్ట్రంలోను, దేశంలోనూ వేలెత్తి చూపించుకోకుండా 40 ఏళ్లపాటు రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు. అయితే.. అది విజయవాడ నియోజకవర్గమా.. ఇంకో నియోజకవర్గమా అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారీ పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని ధీమా వ్యక్తం చేశారు.