కార్పొరేషన్లపై టీడీపీ కన్ను..మంచిదేనా?
అధికారంలో ఉన్నప్పుడు.. ఏం చేసినా చెల్లుతుందా? ఏం చెప్పినా వేదవాక్కు అవుతుందా?
అధికారంలో ఉన్నప్పుడు.. ఏం చేసినా చెల్లుతుందా? ఏం చెప్పినా వేదవాక్కు అవుతుందా? అంటే.. అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ, ప్రజలంటూ ఉన్నారు కాబట్టి.. వారు గమనిస్తుంటారు కాబట్టి.. ఏం చేసినా చెల్లుతుందని భావించే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ లేదు. గతంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను అభాసు పాలు చేయడంతోపాటు.. పంచాయతీలను తొక్కిపెట్టినందుకే.. ఆ పార్టీపై గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఆగ్రహం పెరిగింది.
ఇక ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు ఏపీని ఏలుతోంది. పాలన ఎలా ఉన్నా.. తెరవెనుక మాత్రం కొంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఫలితంగా.. ప్రజల్లో కూటమి సర్కారు పై ఉన్న ఆకాంక్షల్లో ఎక్క డో తేడా కొడుతోంది. క్షేత్రస్తాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం.. కార్పొరేషన్లు, నగర పాలక సంస్థలు ఏర్పడ్డాయి. వైసీపీ నాయకులు కార్పొరేషన్లలో పాలన సాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు వీటిని తమ వశం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండడం రాజకీయంగా వివాదానికి దారితీస్తోంది.
మరో ఏడాదిన్నరలో ఎలానూ.. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. కానీ, ఇప్పుడే వాటిని సొంతం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో టీడీపీనాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు వంటి కీలక మైన కార్పొరేషన్.. కూటమి పార్టీల పరమైంది. మేయర్ సహా 25 మంది కార్పొరేటర్లు.. టీడీపీ-జనసేన పార్టీ ల్లో చేరిపోయారు. దీనికి తోడు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండడంతో చిత్తూరు కార్పొరే షన్‌లో నిన్న మొన్నటి వరకు ఉన్న వైసీపీ పాలన టీడీపీ చేతిలోకి వచ్చింది.
తర్వాత.. విశాఖపట్నం కార్పొరేషన్‌పైనా .. టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. దీనిని కూడా కూటమి పరం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇలా కార్పొరేషన్లను వైసీపీ నుంచి లాగేసుకుని పాలన చేస్తుండడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఇప్పుడు పాలన మారడం.. నాయకులను పార్టీల్లోకి చేర్చుకోవడంపై వారు వ్యతిరేకంగా ఉన్నారు. మరో ఏడాదిన్నర లో ఎన్నికలు ఉన్నప్పుడు ఇలా చేయడం ఎందుకన్నది మేధావుల నుంచి కూడా వస్తున్న ప్రశ్న.