వైసీపీతో పాటు టీడీపీ గ్రాఫ్ కూడా తగ్గుతోందా...?
ఏపీలో రాజకీయ పరిస్థితిని ఎంతో కొంత అద్దం పట్టే ప్రయత్నం అయితే చేశాయి
ఏపీలో జూలై నెలలో రెండు జాతీయ సర్వేలు వచ్చాయి. అవి ఏపీలో రాజకీయ పరిస్థితిని ఎంతో కొంత అద్దం పట్టే ప్రయత్నం అయితే చేశాయి. జూలై ఒకటిన వచ్చిన టైమ్స్ నౌ సర్వే చూసుకుంటే ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చింది. ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉంటే అందులో ఒక్కటి తప్ప 24 సీట్లను వైసీపీ ఖాతాలోకి టైమ్స్ నౌ సర్వే వేసింది.
ఇక జూలై నెల చివరిలో వచ్చిన మరో సర్వే ఇండియా టీవీ మీడియా చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో వైసీపీ 18, టిడిపి 7 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. ఇక ఏపీలో చూసుకుంటే మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉంటే 2019 లో వైసీపీ 22 సీట్లను గెలుచుకుంది. ఇపుడు 18 సీట్లు అంటే గ్రాఫ్ తగ్గినట్లే భావించాలి. అదే విధంగా గత ఎన్నికల్లో టీడీపీ 3 ఎంపీ సీట్లను గెలుచుకుంటే ఈసారి అవి ఏడుకు పెరుగుతాయని సర్వే వెల్లడిస్తోంది.
అంటే అక్కడికి వైసీపీ 4 ఎంపీ సీట్లని కోల్పోతే ఆయా సీట్లను .టిడిపి గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతున్న మ్యాటర్. ఇక్కడ ఓట్ల షేర్ ని కూడా మాట్లాడుకోవాలి. టైమ్స్ నౌ సర్వె అయితే 52 శాతానికి పైగా వైసీపీకి ఇస్తే ఇండియా టీవీ సర్వే మాత్రం 46 శాతానికే పరిమితం చేసింది. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న 50 శాతం ఓట్ల షేర్ కి ఇది నాలుగు శాతం తక్కువ.
అదే విధంగా టీడీపీకి 2019 ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గినా ఓట్ల షేర్ మాత్రం 40 శాతం వద్దనే నిలిచి ఉంది. కానీ ఇండియా సర్వే చూస్తే 36 శాతానికే టీడీపీ ఓట్ షేర్ ని పరిమితం చేసింది. దీని బట్టి చూస్తే టీడీపీ ఓట్ల గ్రాఫ్ కూడా నాలుగు శాతం దాకా తగ్గిందని అంటున్నారు.
అయితే ఈ రెండు సర్వేలూ ఏపీలో పొత్తులను ఎత్తులను తెర వెనక వ్యూహాలను టచ్ చేయలేదు అని అంటున్నారు. అంటే జనసేన బీజేపీ టీడీపీ పొత్తు ఉంటే ఏపీలో ఎలా ఉంటుంది అన్నది కూడా సర్వే చేస్తేనే అసలైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. అయితే ఇండియా టీవీ సర్వే ఈ విషయంలో కొంత వాస్తవానికి తగ్గట్లుగా ఉంది అనుకోవచ్చు.
ఎందుకంటే వైసీపీకి టీడీపీకి చెరి నాలుగు శాతం తగ్గిన ఓట్ల షేర్ జనసేన బీజేపీ కూటమి వైపుగా షిఫ్ట్ అవుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అంటే జనసేన ఎదుగుతోంది అంటే టీడీపీ ఓట్లను కూడా తీసుకుంటోంది అని అంచనా వేయాలి. మరి పొత్తులలో కనుక ఈ పార్టీలు ఒక్కటైతే వైసీపీ టీడీపీకి ఆల్టర్నేషన్ గా జనసేనను చూసిన ఈ ఎనిమిది శాతం ఓట్లు టీడీపీతో కలుస్తాయా అన్నది కూడా చూడాల్సి ఉంది
ఇక ఈ ఎనిమిది శాతం ఓట్లు కలిపినా కూడా టీడీపీకి వైసీపీకి మధ్య రెండు శాతం తేడా కనిపిస్తోంది. అయితే ఈ సర్వేలను పక్కన పెట్టి చూసినా ఈ రోజుకి మాత్ర ఏపీ ఓటర్ వైసీపీని గెలుపు అంచులోనే ఉంచారని అర్ధం అవుతోంది. గతంలో వచ్చిన 151 సీట్లు రాకపోయినా బొటా బొటీ మెజారిటీతో 2024లో నెగ్గుతుందని భావించేలా ఈ సర్వేలు ఉన్నాయి. ఇక ఇదే ఇండియా టీవీ సర్వే ఇచ్చిన 18 ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లుగా కన్వర్ట్ చేసుకుంటే వైసీపీకి భారీ ఆధిక్యం చూపించినట్లుగా వెల్లడి అవుతుంది. అలా చూస్తే అసెంబ్లీ స్థానాల్లో 125 స్థానాలపైనే వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.