మహాత్మా.. నువ్వైనా కళ్లు తెరిపించు: గాంధీ సమాధి వద్ద టీడీపీ ప్రత్యేక నివాళి
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీ నేతలు, ఎంపీలు ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలపై గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీ నేతలు, ఎంపీలు ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలపై గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటు పార్లమెంటులోపల, అటు బయట కూడా.. తాము చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని వినిపిస్తామని చెప్పినట్టుగానే నాయకులు అదే పనిచేస్తున్నారు. పార్లమెంటులోనూ.. బయట కూడా చంద్రబాబు విషయాన్ని, ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరును కూడా వారు ఎండగడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ నాయకులు మౌన దీక్ష చేశారు. ''మహాత్మా నువ్వైనా ఏపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించు'' అంటూ.. వారు ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోనే ఉన్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని కనకమేడల రవీంద్రకుమార్ సహా.. పలువురు మాజీ ఎంపీలతో కలిసి నారా లోకేష్.. గాంధీ సమాధిని సందర్శించారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి..ఏపీ సర్కారు వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. గాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసి.. అనంతరం.. కొద్ది సేపు అక్కడే కూర్చుని.. మౌన ప్రదర్శన చేశారు. ఏపీలో అరాచక పాలనను కట్టడి చేయాలని, ప్రజాస్వామ్య యుతంగా పాలించే బుద్ధిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకున్నట్టు ఎంపీ కనకమేడల చెప్పారు. ఈ రోజు నుంచి పార్లమెంటులో ఏపీ విషయాన్ని మరింత బలంగా వినిపించనున్నట్టు ఆయన చెప్పారు.