వీడియో... టిక్కెట్ దక్కలేదని బోరున విలపించిన టీడీపీ నేత!
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పందించారు
కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య టిక్కెట్ల సంఖ్య విషయంలో క్లారిటీ వచ్చినా.. అభ్యర్థుల ఎంపిక, పార్టీల వారీగా స్థానాల కేటాయింపుల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ మరింత సమస్యగా మారుతుందని తెలుస్తుంది. ఇలాంటి ఇంటర్నల్ ప్రాబ్లంసే రేపు మొదటికే మోసం తెచ్చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పందించారు. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిలో భాగంగా తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ కు జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరు ప్రకటించారు జనసేనాని పవన్ కల్యాణ్. దీంతో... గత ఎన్నికల్లో చిత్తురు అసెంబ్లీ నుంచి వైసీపీ టిక్కెట్ పై గెలిచిన ఆరణికి తిరుపతి టిక్కెట్ ఎలా ఇస్తారంటూ అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు జనసేన నేతలు కూడా ఫైరవుతున్న పరిస్థితి.
ఈ సమయంలో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని సుగుణమ్మకే కేటాయించాలంటూ స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వస్తోన్నారు! ఈ నేపథయంలో తాజాగా ఆ విషయాలపై స్పందించిన ఆమె... పార్టీకోసం, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసినట్లు తెలిపారు. టిక్కెట్ కేటాయింపు విషయంలో చంద్రబాబు చేయించిన సర్వేలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఆమె సోమవారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన తమకు టిక్కెట్ దక్కకపోవడం బాధాకరమని ఆమె తెలిపారు. ఇదే సమయంలో... తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై పునరాలోచించుకోవాలని ఆమె చంద్రబాబు, పవన్ లను కోరారు. ఇదే సమయంలో స్థానిక టీడీపీ, జనసేన నేతలు సైతం ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆమె తెలిపారు.
ప్రధానంగా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడ మద్దతు పలకమంటే తాను అంగీకరించేది లేదని, అదే విధంగా పార్టీ కేడర్ కూడా అంగీకరించడం లేదని, తిరుపతి అభ్యర్థిత్వంపై చంద్రబాబు పునరాలోచిస్తారని తాము నమ్ముతున్నామని తెలిపారు. తిరుపతికి తమ కుటుంబం ఎంతో చేసిందని చెబుతూ... మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతం అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ!