బాబు మార్క్ తాయిలాలు... టికెట్లు రాని వారు శాంతిస్తారా...!?

అయినా బాబు చాలా మందిని సర్దిచెప్పారు. కొందరిని ఎంపిక చేసి మరీ పార్టీ పదవులు ముందుగా ఇచ్చేస్తున్నారు.

Update: 2024-03-27 02:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో గండర గండడు అని అంటారు. ఆయన ఏదో వ్యూహం పన్నుతూనే ఉంటారు. ఆయన వద్ద నో అన్న మాట ఉండదు. అంతకంటే ముందు ఆయన వద్దకు ఎవరు వెళ్లినా విముఖుడిని సుముఖుడిగా చేసి పంపుతారు అని అంటారు. మరీ మొండిగా ఉంటే తప్ప దాదాపుగా పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చాకచక్యంగా అణచివేసే సత్తా బాబుకే సొంతం అని కూడా అంటారు.

టీడీపీ ఈసారి టికెట్ల పంపిణీతో పెద్ద ఎత్తున వత్తిడిని ఎదుర్కొంది అన్నది నిజం. ఎందుకంటే అయిదేళ్లుగా అధికారంలో పార్టీ లేదు. ఆశావహులు చూస్తే రెట్టింపు కాదు మూడు రెట్లు అయ్యారు. అదే సమయంలో పొత్తులకు బాబు తెర తీశారు. మరో రెండు పార్టీలను కలుపుకుని ఆయన ఎన్నికల సమరానికి దిగుతున్నారు. ఇది అనివార్యం కూడా.

దాంతో ఏకంగా 31 అసెంబ్లీ సీట్లను ఎనిమిది ఎంపీ సీట్లను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది. విభజన ఏపీలో ఈ నెంబర్ లో సీట్లను త్యాగం చేయడం అన్నది రికార్డు. ఉమ్మడి ఏపీలో అయితే 294 సీట్లు ఉండేవి. ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఇపుడు సీన్ మారింది.

అయినా బాబు చాలా మందిని సర్దిచెప్పారు. కొందరిని ఎంపిక చేసి మరీ పార్టీ పదవులు ముందుగా ఇచ్చేస్తున్నారు. రేపటి రోజున అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. అందుకే ముందుగా వారిని శాంతింప చేయడం కోసం బాబు కీలకమైన నేతలను ఎంచి మరీ పార్టీ పదవులు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

అలా పార్టీ పదవులు అందుకున్న వారిలో మాజీ మంత్రి కె ఎస్ జవహర్ ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ దక్కలేదు. అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయనను ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంటే లోకేష్ తో సరిసమానమైన పదవి అన్న మాట. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన మరో ముఖ్య నేత రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు.

ఇక విశాఖకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా నియమించారు. అలాగే బి.వి. వెంకట్రాముడును ని హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మననే సుబ్బారెడ్డి, యతిరాజా రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీ కృష్ణంరాజు, వాసురెడ్డి ఏసుదాసులను నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వీరితో పాటు మరింతమందికి కూడా పదవులు ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నారు. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. దాంతో గెలిచి తీరాలన్నది బాబు పట్టుదల. అందుకోసం ఏ ఒక్కరినీ కాదనుకోవడంలేదు. అందుకే ముందుగా పార్టీ పదవులను పందేరం చేస్తున్నారు మరి ఈ పదవులతో నేతలు సంతృప్తి చెందుతారా లేక తమ రూట్ తమదే అని దారి చూసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News