వైసీపీ వర్సెస్ టీడీపీ : నూటొకటి కొడుతోందా...?

2014లో ఇక్కడ తొంబై శాతం పైగా సీట్లు గెలుచుకుని టీడీపీ బీజేపీ జనసేన కూటమి హిట్ కొట్టింది.

Update: 2024-04-10 13:37 GMT

కోస్తా జిల్లాలలో 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ సీట్లే చాలా ముఖ్యం. 2014లో ఇక్కడ తొంబై శాతం పైగా సీట్లు గెలుచుకుని టీడీపీ బీజేపీ జనసేన కూటమి హిట్ కొట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులువు అయింది.

అప్పట్లో వైసీపీ గ్రేటర్ రాయలసీమ అంటే ఆరు ఉమ్మడి జిల్లాలు అయిన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలలో అత్యధిక సీట్లు సాధించినా కోస్తాలో చతికిలపడింది. జగన్ పార్టీ కేవలం రాయలసీమ పార్టీగా మిగిలింది.

దాంతో గ్రేటర్ రాయలసీమ దాటలేదు గుంటూరు గేటు దగ్గర ఆగిపోయింది. అయితే 2019లో మాత్రం కోస్తా టీడీపీని పక్కన పెట్టేసింది. మొత్తం 101 అసెంబ్లీ సీట్లలో 84 సీట్లు వైసీపీకి ఇచ్చింది. దాంతో పాటు గ్రేటర్ రాయలసీమ సీట్లు నూటికి తొంబై అయిదు శాతం వైసీపీ గెలుచుకోవడంతో 151 సీట్లలో అద్భుతమైన విజయం ఆ పార్టీ సొంతం అయింది.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి కోస్తాలో ఎక్కువ సీట్లు వస్తాయన్న చర్చకు తెర లేస్తోంది. 2014 రిజల్ట్ రిపీట్ అవుతుందని టీడీపీ కూటమి అంచనా వేస్తోంది. అయితే అప్పటికీ నేటికీ పరిస్థితి మారిందని వైసీపీ చెబుతోంది. 2014 నాటికి జగన్ కేవలం రాయలసీమకే పరిచయం అయి ఉన్నారని ఎక్కువ అక్కడే ఆదరణ దక్కిందని, అయితే 2017 నుంచి రెండేళ్ల పాటు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా కోస్తా జిల్లాలలో వైసీపీకి రాజకీయ బలం పెరిగిందని అంటున్నారు.

ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన అయిదేళ్ల పాలనలో కోస్తా జిల్లాలలో వైసీపీ బలం పెంచుకుందని అంటున్నారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు సాధించడం వల్ల కూడా గ్రాస్ రూట్ లెవెల్ లో ఆ పార్టీ స్థిరపడిందని చెబుతున్నారు.

దాంతో వైసీపీకి టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్న వాతావరణం ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో కోస్తా జిల్లాలలో ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం విడిగా పోటీ చేయడం అని విశ్లేషించుకుంటోంది. జనసేన పోటీ వల్ల 40కి పైగా సీట్లలో టీడీపీకి నష్టం వాటిల్లింది అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు ఆ పొత్తు కుదిరింది కాబట్టి కచ్చితంగా తమకు గెలిచే అవకాశాలు ఉంటాయని లెక్క వేస్తోంది.

చాలా నియోజకవర్గాలలో టీడీపీ జనసేన రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపిస్తే వైసీపీ కంటే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. దానితో పాటు అయిదేళ్ళ పాలన వల్ల వైసీపీకి సహజంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని దాని వల్ల వైసీపీ ఓటు షేర్ బాగా తగ్గిపోతుందని లెక్క వేస్తోంది. దాంతో తమ విజయం ఖాయమని మెజారిటీ సీట్లు వస్తాయని అంటోంది.

అయితే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు హోరా హోరీ పోరు సాగుతోందని చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గం టఫ్ గానే ఉంటోందని లెక్కలు వివరిస్తున్నాయి. పొత్తు వల్ల రెండు రెండు నాలుగు అవుతాయా లేదా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. జనసేన తో టీడీపీ పొత్తు వల్ల రెండు పార్టీలలో అసంతృప్తులు ఉన్నాయని అదే విధంగా సింగిల్ గా జనసేన పోటీ చేస్తే పవన్ సీఎం అభ్యర్ధి అంటే ఓటు వేసే వారి సంఖ్య వేరుగా ఉంటుందని ఇపుడు ఆ ఓటు చెదిరిపోతుందని అంటున్నారు.

ఇక కోస్తాలో చూస్తే కనుక ఉమ్మడి ఏడు జిల్లాలలో క్రిష్ణా గుంటూరులలో జనసేన ప్రభావం తక్కువగా ఉంది. ఇక్కడ టీడీపీ వైసీపీల మధ్య ముఖాముఖీ పోటీ సాగుతోంది. దాంతో రెండు పార్టీలు సీట్ల విషయంలో గట్టి పట్టుదలగానే ఉన్నాయి. ఏకపక్షంగా ఇక్కడ తీర్పు అయితే కనిపించడం లేదు అని సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే కనుక ఇక్కడ కాపు ఫ్యాక్టర్ బలంగా ఉంటుందని మొదట్లో అంచనా వేశారు. కానీ పొత్తులు సీట్లు పంపకాలు అభ్యర్థులు డిసైడ్ అయ్యాక బలమైన ఆ సామాజిక వర్గం న్యూట్రలైజ్ అయ్యారని అంటున్నారు. దాంతో వైసీపీకి జనవరి ఫిబ్రవరి నాటి గడ్డు పరిస్థితి అయితే ఇపుడు లేదు అనే అంటున్నారు.

ఇక్కడ టీడీపీ కూటమిని ఢీ కొట్టే స్థాయిలో వైసీపీ ఉంది. సీట్ల విషయంలో కూటమి కొంత ఆధిక్యం ప్రదర్శించినా అది మరీ డబుల్ డిజిట్ స్థాయిలో ఉండటం లేదని అంటున్నారు. సో ఆ విధంగా చూస్తే 2014 ఫలితాలు రావని రెండు పార్టీలకు అవకాశాలు బాగానే ఉన్నాయని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రాలో చూసుకుంటే బీసీలు వైసీపీ వైపు ఉన్నారు. ఇక్కడ కాపులు కూడా బీసీ విభాగంలోకి వస్తున్నారు. దాంతో పాటు ఇతర సామాజిక వర్గాలలో గతంలో టీడీపీకి పూర్తి పట్టు ఉండేది. ఇపుడు వైసీపీ తన షేర్ ని తీసుకుంటోంది. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో రెండు పార్టీలకు అటు ఇటుగానే సీట్లు రావచ్చు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే కోస్తా జిల్లాలలో మొత్తం 101 సీట్లలో ఎవరిది ఆధిపత్యం అంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఉంది అంటున్నారు. ఎవరికీ కూడా 2014, 2019నాటి ఫలితాలు అయితే రావు అంటున్నారు. దాంతో కోస్తా రాజకీయం వైసీపీ టీడీపీలకు నూ టొక్కటి కొట్టేలా చేస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News