టీడీపీ ప్లస్ జనసేనకు మిగిలేది ముప్పయి శాతమేనట...!
ఇక అధికారంలోకి వచ్చాక మొత్తం ఏపీలోని కోటీ అరవై లక్షల కుటుంబాల లో నలభై లక్షల కుటుంబాల వారికి నేరుగా నగదు లబ్దిని చేకూర్చామని, మిగిలిన వర్గాల వారికి కూడా ఏదో విధంగా సంక్షేమాన్ని అందించడం జరిగిందని ఆ పార్టీ అంటోంది.
ఏపీ రాజకీయాల్లో సర్వేలు వస్తున్నాయి. అయితే తెలంగాణాలో వచ్చినంత జోరుగా రావడం లేదు. అడపా తడపా వస్తున్నాయి. ఇందులో చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగానే వస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా అనుకూల సర్వేలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిస్తే జెండా ఎగరేయడమే అని ఆ రెండు పార్టీల నేతలూ ధీమాగా ఉన్నారు.
అయితే వైసీపీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంది. ధీమా అంటే మాదే అని అంటోంది. మేము కనుక ఒకసారి ఎన్నికల గోదాలోకి దిగితే అద్భుత విజయం తప్ప మరో సౌండ్ వినిపించదు అని గట్టిగా చెబుతోంది. టోటల్ గా ఎనభై శాతం మంది ప్రజానీకం 2019 ఎన్నికల్లో వైసీపీని సపోర్ట్ చేశారు. దాంతో 151 సీట్లతో వైసీపీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.
ఇక అధికారంలోకి వచ్చాక మొత్తం ఏపీలోని కోటీ అరవై లక్షల కుటుంబాల లో నలభై లక్షల కుటుంబాల వారికి నేరుగా నగదు లబ్దిని చేకూర్చామని, మిగిలిన వర్గాల వారికి కూడా ఏదో విధంగా సంక్షేమాన్ని అందించడం జరిగిందని ఆ పార్టీ అంటోంది. దాంతో ఈసారి సాలిడ్ గా అదే ఎనభై శాతం జనాలు తమ వైపు నిలబడతారు అన్నది వైసీపీ ధీమా.
ఒక వేళ ఏమైనా కారణాల వల్ల అటూ ఇటూ ఓట్లు మారినా డెబ్బై శాతం మాత్రం నికరంగా వైసీపీ వైపే అన్నది ఆ పార్టీ పెద్దల భావనగా ఉంది. తమ కంటే ఎవరూ ఎక్కువగా సంక్షేమ పధకాలు అందించలేరని, అలాగే తమకంటే ఎవరూ ప్రజలకు పూర్తి హామీలు నెరవేర్చలేదని కూడా చెప్పుకుంటోంది. ఈ రోజున జనసేన టీడీపీ కాంబో అయినా తమ పధకాలనే మార్చి హామీలుగా ఇవ్వాలి తప్ప కొత్తగా ఇచ్చేది లేదని కూడా అభిప్రాయపడుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి లేనిది తమకు ఉన్నది క్రెడిబిలిటీగా వైసీపీ పదే పదే చెప్పుకుంటోంది. తాము విశ్వసనీయతకు మారు పేరు అని డే వన్ నుంచి అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పధకాలను అమలు చేసి చూపించామని కాబట్టి తాము చెప్పిన మాటలను నిలబెట్టుకున్నామని జనాలు నమ్ముతారని వైసీపీ నమ్ముతోంది.
ఈ నేపధ్యంలోనే ఆ పార్టీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ జనసేన మాత్రమే కాదు ఎన్ని పార్టీలు కలసికట్టుగా వచ్చినా ముప్పై శాతం ఓట్లలోనే పంచుకోవాలని అంటున్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ డెబ్బై శాతం ఓట్లలో తేడా జరగదని అవన్నీ పక్కాగా తమకే పడిపోతాయని కూడా చెప్పుకొచ్చారు. ప్రజల కోసం నిలబడిన నేతగా జగన్ ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో రుజువు చేసుకున్నారని, అందుకే మరోమారు జగన్ని ఎన్నుకోవడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని సజ్జల అంటున్నారు.
మరి సజ్జల చెప్పిన ముప్పయి శాతం ఓట్లేనా విపక్షాలకు మిగిలేది అన్నదే ఇపుడు కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఈసారి 160 సీట్లకు తగ్గకుండా టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి వైసీపీకి డెబ్బై శాతం వస్తే టీడీపీ సేన కూటమి 160 సీట్లు ఎలా వస్తాయి అసలు ధీమా ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరిది అన్నదే ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా ఉంది. రానున్న రోజులలో కొంతవరకూ ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఏంటి అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.