మంగళగిరిలో టీడీపీ దాష్టీకం!... వైసీపీ కార్యకర్త పరిస్థితి విషమం!
ఎన్నికల నామినేషన్ మొదలైన అనంతరం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రోహిణీ కార్తి ఎండలను తలదన్నేలా సెగలు కక్కుతున్నాయి
ఎన్నికల నామినేషన్ మొదలైన అనంతరం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రోహిణీ కార్తి ఎండలను తలదన్నేలా సెగలు కక్కుతున్నాయి. ఈ సమయంలో కొంతమంది నేతలు పైకి చెప్పే నీతి కబుర్లు.. ఎండమావులనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు, వైసీపీ వర్గీయులపై దాడులకు తెగబడటంతో ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త పరిస్థితి ఇప్పుడు విషయంగా ఉందనే విషయం కలకలం సృష్టిస్తోంది.
అవును... ప్రధాన మీడియా నివేధికల ప్రకారం... తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గీయులను పలువురు టీడీపీ కార్యకర్తలు, ప్రధానంగా లోకేష్ అనుచరులు.. దుర్భాషలాడుతూ, ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారని అంటున్నారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడగా.. వీరిలో తీవ్రంగా గాయపడిన మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా.. తాజా సమాచారం మేరకు ఆయన కోమాలో ఉన్నారని తెలుస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... స్థానిక సీఎస్సార్ రోడ్ లో ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకుని, ప్రచారం చేయవద్దని అన్నారని.. ఆ సమయంలో మద్యం మత్తులో టూవీలర్స్ పై వచ్చిన వారంతా... వైసీపీ కార్యకర్తలను ఘెరావ్ చేస్తూ.. లోకేష్ గెలవాలంటూ కేకలు వేశారని తెలుస్తుంది. ఈ సమయంలో అక్కడ ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్త, బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పుతూ అల్లరిచేశారని అంటున్నారు.
ఈ క్రమంలో “జై లోకేష్” అంటూ ఒక యువకుడు టూవీలర్ పై వచ్చి, వైసీపీ కార్యకర్తలను బూతులు తిడుతూ.. మరో ఐదుగురితో కలిసి మోటారు సైకిల్ తో వైసీపీ కార్యకర్తలను ఢీకొట్టారు. దీంతో... ముగ్గురు వైసీపీ నాయకులు, బూత్ కన్వీనర్ రోడ్డుపై పడిపోయారు. ఈ నేపథ్యంలోనే కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి ఢీకొట్టడంతో ఆయన కిందపడిపోగా.. తలకు తీవ్రంగా గాయమైందని తెలుస్తోంది.
ఈ సమయంలో తలకు తీవ్ర గాయమైన మేకా వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చగా.. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు! ఈ సమయంలో అతడు ప్రస్తుతం కోమాలో ఉన్నాడని.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. దీంతో... విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో దాడికి పాల్పడిన వారి వాహనాల్లో ఒక టూవీలర్ నెంబర్ ఏపీ 39 ఎఫ్.వై. 2192 గా ఉందని.. అంటే... విశాఖ అడ్రస్ తో ఉందని అంటున్నారు. దీంతో... బయట నుంచి మంగళగిరికి దుండగులను దింపారనే ప్రచారం తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... మంగళగిరిలో టీడీపీది భయమా.. లేక, బరితెగింపా అంటూ నిలదీస్తున్నారు వైసీపీ కార్యకర్తలు!