తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అప్ డేట్... తెరపైకి మంత్రి మల్లారెడ్డి మేటర్!

ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి రాజకీయాన్ని కేసీఆర్ హీటెక్కిస్తే... డిక్లరేషన్స్ తో కాంగ్రెస్ జోరు పెంచింది

Update: 2023-09-07 07:32 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి రాజకీయాన్ని కేసీఆర్ హీటెక్కిస్తే... డిక్లరేషన్స్ తో కాంగ్రెస్ జోరు పెంచింది. మరోపక్క బీజేపీ కూడా తన మార్కు రాజకీయం తాను చేస్తుంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంటోంది. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తీన్మార్ మల్లన్న పార్టీ పేరును రిజిస్టర్ చేసే ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. ఇదే క్రమంలో పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ప్రజలను ఈసీ కోరింది. దీంతో ఎన్నికల సమయానికి తెలంగాణలో కొత్త పార్టీ ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... ఈ ఏడాది ఏప్రిల్‌ లో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పేరును కూడా నాడే వెల్లడించారు. "తెలంగాణ నిర్మాణ పార్టీ" పేరుతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో... పార్టీ పేరుపై ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ప్రజలను ఎన్నికల కమిషన్ కోరింది. ఈ మేరకు ఈసీ వెబ్‌ సైట్‌ లో ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోపు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ... "తెలంగాణ నిర్మాణ పార్టీ" ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్, కోశాధికారిగా ఆర్.భావనను ఈసీ గుర్తించింది.

తెరపైకి మల్లా రెడ్డిపై పోటీ మేటర్:

గతంలో కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా తాను పోటీ చేయబోయే స్థానం, తాను ఎంచుకున్న ప్రత్యర్ధిపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో తాను మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో మల్లారెడ్డిని ఓడించి తీరుతానని తెలిపారు!

దీంతో తన పార్టీ నుంచి ఈసారి నిజంగానే మల్లన్న మేడ్చల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా.. మంత్రి మల్లారెడ్డిపై పోటీకి సిద్ధపడతారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో... తీన్మార్ మల్లన్న పార్టీ... రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందా.. లేక, కొన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను నిలబెడుతుందా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News