తాజ్‌ మహల్‌ కాదంట.. తేజో మహాలయం అంట!

1600వ దశకంలో మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌.. తన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌ మహల్‌ ను నిర్మించారు. ఇందులో ఆమె సమాధి ఉంది

Update: 2024-08-07 10:51 GMT

తాజ్‌ మహల్‌.. ప్రపంచ వింతల్లో ఒకటనే సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌ లోని ఆగ్రాలో ఉన్న ఈ పాలరాతి కట్టడాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల్లో పర్యాటకులు భారత్‌ కు వస్తున్నారు.

1600వ దశకంలో మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌.. తన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌ మహల్‌ ను నిర్మించారు. ఇందులో ఆమె సమాధి ఉంది. కాగా తాజ్‌ మహల్‌ కు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అపురూప పాలరాతి మందిరంలోని ప్రధాన సమాధి వద్దకు వాటర్‌ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది.

పర్యాటకులు తాగునీరు కావాలిస వస్తే ప్రధాన సమాధి దగ్గరలోనే ఉండే చమేలీ ఫ్లోర్‌ లోకి నీటిని తాగాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు వెల్లడించారు.

మరోవైపు తాజ్‌ మహల్‌ ఉన్న ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదని.. దానిపై తాజ్‌ మహల్‌ నిర్మించారని ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఇదే విషయంపై అఖిల భారత హిందూ మహాసభ సైతం తన వాదన వినిపిస్తోంది.

తాజ్‌ మహల్‌ అసలు పేరు తేజో మహాలయం అని, అది శివుడికి నిలయం అని హిందూ మహా సభ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు.. తాజ్‌ మహల్‌ లోని ప్రధాన సమాధిపై గంగాజలం తెచ్చి పోశారు. వీరిని చూసి ఇంకో మహిళ సైతం గంగాజలంతో అభిషేకం చేసింది. దీనిపై కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం (సీఐఎస్‌ఎఫ్‌) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హిందూ మహా సభ కార్యకర్తలపై ఫిర్యాదు దాఖలైంది.

మరోవైపు శ్రావణ మాసం ప్రవేశించడంతో తాజ్‌ మహల్‌ లో జలాభిషేకం, క్షీరాభిషేకాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి, ఇప్పటికే యోగి యూత్‌ బ్రిగేడ్‌ స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

జలాభిషేకం, క్షీరాభిషేకాలకు అనుమతులు ఇవ్వడంతోపాటు తాజ్‌ మహల్‌ పై సర్వే చేయించాలని కోర్టుకు యోగి యూత్‌ బ్రిగేడ్‌ విన్నవించింది. ఈ అధ్యయనం కోసం కోర్టు కమిషనర్‌ ను నియమించాలని కోరింది. తాజ్‌ మహల్‌ ప్రాచీన శివాలయమనడానికి ఆధారాలున్నాయని తన పిటిషన్‌ లో పేర్కొంది. దీనిపై ఆగస్టు 13న కోర్టు విచారణ జరపనుంది.

Tags:    

Similar News