కాంగ్రెస్ సర్కార్ కు 100 రోజులు.. మార్చి 17 లోక్ సభ నోటిఫికేషన్?
తెలంగాణలో డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరు గ్యారెంటీలను ప్రకటించి వాటి అమలుకు చర్యలు చేపడుతోంది
దేశం ఈసారి కీలక ఎన్నికలను ఎదుర్కోనుంది. అదేంటి..? ప్రతిసారీ చెప్పే మాటనే కదా ఇది..? ప్రతి ఎన్నికా కీలకమైనదే కదా..? అంటారేమో..? కానీ ఈసారి అలా కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభ నేపథ్యంలో మోదీ పేరు ఉత్తరాదిన మార్మోగుతోంది. ఆయనను ఎలాగైనా దించేయాలనే పట్టుదలతి విపక్షాలు ‘ఇండియా’ పేరిట కూటమి కట్టాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో (న్యాయ్ యాత్ర) చేపట్టారు. ఇంతటి హోరాహోరీ ఎన్నికలకు మరో రెండు నెలలు కూడా సమయం లేదని తెలుస్తోంది.
టి-సర్కార్ కు 100 రోజులతోనే
తెలంగాణలో డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరు గ్యారెంటీలను ప్రకటించి వాటి అమలుకు చర్యలు చేపడుతోంది. ఒక్కోటిగా హామీలను నెరవేరుస్తూ వస్తోంది. మార్చి 17తో తెలంగాణ సర్కారుకు 100 రోజులు పూర్తవుతాయి. సరిగ్గా ఇదే సమయానికి లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణ సర్కారు కూడా తమ హామీల అమలుకు వందరోజులను డెడ్ లైన్ గా చెబుతోంది. అంటే.. ఆ హామీలు పట్టాలెక్కేసరికే లోక్ సభ ఎన్నికల పర్వం మొదలవుతుందన్నమాట.
క్రితం సారి కంటే ముందే..?
2019లో దేశంలో 17వ లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 దశల్లో ఎన్నికలను నిర్వహించారు. నాడు మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. 20 రాష్ట్రాల్లో 91 పార్లమెంటు స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ శాసనసభకు ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించారు. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఈసారి ఒకటీరెండు రోజులు ముందుగానే నోటిఫికేషన్ వచ్చే చాన్సుందని భావిస్తున్నారు. మార్చి 17కు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ రానున్నట్లు స్పష్టమవుతోంది.
ఈసారి ఎన్ని దశల్లోనో..?
లోక్ సభతో పాటు 2024 తొలి అర్ధ భాగంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పెద్ద రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలోనూ అసెంబ్లీ ఎన్నిలున్నాయి. కాగా.. 2019లో లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి. ఈసారి ఎన్ని విడతల్లో సాగుతాయో చూడాలి. అందులోనూ.. మణిపూర్ వంటి సంక్షోభాల నేపథ్యంలో గతం కంటే ప్రస్తుతం పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. గతంలో విడివిడిగా పోటీ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఐదేళ్ల కిందటి కంటే వాటిలో నేడు తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్నామన్న కసి కనిపిస్తోంది. అటు మోదీ వివిధ అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి?