ఆంధ్ర లిక్కర్ వ్యాపారంలోకి తెలంగాణ వాసులు.. అదృష్టం అంటే వీరిదే..

దేశంలో ఏ రాష్ట్రం వారు అయినా ఎక్కడైనా మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

Update: 2024-10-15 07:33 GMT

దేశంలో ఏ రాష్ట్రం వారు అయినా ఎక్కడైనా మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దాంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఎక్కడెక్కడ మద్యం టెండర్లు నడుస్తుంటాయో అక్కడ టెండర్లు వేస్తుంటారు. తాజాగా.. ఏపీలో నిర్వహించిన మద్యం టెండర్లలోనూ అదే ట్రెండ్ కనిపించింది. ఏపీతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ నుంచి కూడా వచ్చి టెండర్లు వేశారు. ఈ టెండర్లలో అదృష్టం వారిని సైతం వరించింది.

ఏపీలో మద్యం షాపుల టెండర్ ప్రక్రియ నిన్న కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడిచింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్లు తమ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. 3,396 మద్యం షాపులను లాటరీ విధానంలో కేటాయించారు. అయితే.. ఇందులో చాలా వరకు షాపులు పొరుగు రాష్ట్రాల వారికి దక్కాయి. అందులోనూ మహిళలకే ఎక్కువ దక్కడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 10.20 శాతం షాపులు మహిళలకే లభించాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున దక్కాయి. తిరుపతి పరిధిలో 32 షాపులు ఉంటే 6 మహిళలకే దక్కాయి. అదృష్టం వస్తుందనే ఉద్దేశంతో వారి భర్తలు భార్యల పేర్లతో టెండర్లు వేయడంతో.. వారంతా పిల్లలతో సహా తరలిరావాల్సి వచ్చింది.

ఇక.. ఏపీ మద్యం టెండర్లలో తెలంగాణ వారు కూడా అదృష్టం దక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి 96వ నంబర్ షాపు కోసం 132 దరఖాస్తుు వచ్చాయి. అలాగే.. 97వ షాప్ కోసం 120, పెనుగంచిప్రోలులోని 81 షాపునకు 110 దరఖాస్తులు వచ్చాయి. అయితే..ఈ మూడు లైసెన్సులు కూడా లాటరీలో తెలంగాణ వాసులకే వచ్చాయి. 96వ నంబర్ షాపు ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణ దక్కించుకున్నాడు. 97వ నంబర్ షాపు రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూష, 81వ షాపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు దక్కాయి. ఇక ఏలూరు జిల్లా కుక్కునూరు 121వ నంబర్ షాపు విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడు మండలానికి చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకుంది. అలాగే.. ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేశ్ అయితే ఏకంగా నలుగు షాపులు దక్కించుకున్నాడు. పుట్టపర్తిలో 1, నంద్యాలలో 3 షాపులు లాటరీలో సాధించాడు. అయితే.. ఈ షాపులు దక్కించుకున్న వారిందరికీ తెలంగాణలోనూ మద్యం షాపులు ఉండడం విశేషం.

వీరితో పాటు.. విజయవాడలోని 14, 18వ నంబర్ షాపులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్ శివ్‌హరే, అర్పిత్ శివ్‌హరేకు వచ్చాయి. మచిలీపట్నంలో ఓ షాపు కర్ణాటకకు చెందిన మహేష్ బాతేకు.. మరోషాపు ఢిల్లీకి చెందిన లోకేష్ చంద్ దక్కించుకున్నారు. ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి షాపులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు కర్ణాటక, తెలంగాణకు చెందిన వ్యాపారులకు దక్కాయి.

Tags:    

Similar News