పేరు ప్రస్థావించకుండా కేసీఆర్ పై రేవంత్ నిప్పులు!!

సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Update: 2024-08-28 09:04 GMT

సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని అన్నారు. రాజకీయ విమర్శల జోలికి పోను కానీ... అంటూనే గత పాలకులపై ఫైరయ్యారు.

అవును... సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి... 2014 నుంచి 2024 వరకూ సుమారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్లు ఎన్నెన్నో నిర్మించామని, ప్రమంచానికే ఆదర్శంగా నిలబడ్డామని గొప్పలు చెప్పుకుంటారు కానీ... తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెరమరుగు చేశారని విమర్శించారు.

ఎందుకంటే... తెలంగాణ తల్లి కంటే వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ.. తెలంగాణే నేను అన్నట్లుగా గత పాలకులు వ్యవహరించారని తెలిపారు. అటువంటి పాతవిధానాలకు ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విరుద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ ప్రస్థావనను తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇందులో భాగంగా... గత పాలకులు ప్రగతి భవన్ పేరు చెప్పి పెద్ద గడీని ఏర్పాటు చేసుకుని, చుట్టూ ముళ్లకంచెలు పెట్టుకున్నారని.. వందల సంఖ్యలో పోలీసుల పహారా మధ్య వారు భద్రంగా అక్కడ ఉండి, తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదని నిషేధించారని తెలిపారు. అలాంటి ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చినట్లు తెలిపారు.

అలాంటి ప్రగతి భవన్ అనే గడీని.. నేడు తెలంగాణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే ప్రదేశంగా మార్చినట్లు తెలిపారు! ఇక సచివాలయం అంటే తెలంగాణ పరిపాలనకు గుండే అని.. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపరమైన నిర్ణయాలు తీసుకొవాలని.. అయితే గత పాలకులు మాత్రం సచివాలయంలో అందుబాటులో ఉండేవారు కాదని ఫైరయ్యారు.

ఇక, దసరాకు మంచి రోజులు లేవని.. అందుకే ఇవాళ భూమిపూజ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు పండగ రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు!

Tags:    

Similar News