ఉద్యమాలు చేస్తే కాదు.. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ దయ!
ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేస్తే ఉక్కుపాదంతో ఆ ఉద్యమాన్ని కేసీఆర్ అణిచివేశారనే విమర్శలున్నాయి
ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్.. వివిధ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు వరాలు జల్లు కురిపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం వివిధ రంగాల ఉద్యోగులు ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి చప్పుడు చేయని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అడగకుండానే వరాలు కురిపిస్తున్నారు.
తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇకపై సర్కారీ జీతాలే ఇస్తామని చెప్పింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని కూడా వెల్లడించింది. అంతా బాగానే ఉంది. కానీ 2019లో ఇదే ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేస్తే.. ఉక్కుపాదంతో ఆ ఉద్యమాన్ని కేసీఆర్ అణిచివేశారనే విమర్శలున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, జీతాలు పెంచాలనే తదితర 24 డిమాండ్లతో అప్పుడు కార్మికులు సమ్మె చేశారు. కానీ దీన్ని పట్టించుకోని కేసీఆర్.. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా అన్నారు. దీంతో కార్మికులు సమ్మె ముగించక తప్పలేదు.
ఇక ఇటీవల తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు కూడా ఆందోళన బాట పట్టారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలు ఉద్యమాన్నిఉవ్వెత్తున చేపట్టారు. కానీ అప్పుడు సీఎం కిమ్మనలేదు. పైగా ఉద్యోగాలు చేరకపోతే వేటు తప్పదని డెడ్‌లైన్ కూడా పెట్టారు.
వీఆర్ఏల ఆందోళనను అలాగే అణగదొక్కారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అప్పుడు వీళ్ల డిమాండ్లను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మాత్రం వరాలు కురిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులరైజ్ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఉత్తర్వులు వెల్లడించిన విషయం విదితమే.