అయ్యో.. రాజయ్య ఏమిటీ హతవిధీ!

మొదటి నుంచి అంతా ఊహించినట్టుగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఈసారి సీటు దక్కలేదు

Update: 2023-08-22 11:56 GMT

మొదటి నుంచి అంతా ఊహించినట్టుగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఈసారి సీటు దక్కలేదు. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాజయ్యకు సీటు నిరాకరించారు. అక్కడ రాజయ్య ప్రత్యర్థి, మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేసీఆర్‌ సీటు కేటాయించారు.

వాస్తవానికి 2018 ఎన్నికలప్పుడే రాజయ్యకు సీటు ఉండదని టాక్‌ నడిచింది. అయితే ఆ ఎన్నికల్లో పెద్దగా రిస్కు చేయని కేసీఆర్‌ నాడు సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు కేటాయించారు. దీంతో రాజయ్య కూడా అప్పుడు సీటు దక్కించుకుని గెలుపొందారు.

గతంలో రాజయ్య డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడే ఒక హీరోయిన్‌ విషయంలో మంత్రి పదవి పోగొట్టుకున్నారని గాసిప్స్‌ నడిచాయి. అయినా సరే ఆయన తన తీరు మార్చుకోలేదు. జానకీపురం సర్పంచ్‌ నవ్య తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని.. అసభ్యంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఆరోపించడం కలకలం రేపింది.

నవ్య ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడం, మహిళా సంఘాల ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధిష్టానం అప్రమత్తమైంది. నవ్యకు క్షమాపణలు చెప్పాలని రాజయ్యను ఆదేశించడంతో ఆయన స్వయంగా ఆమె వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని నవ్య ఆరోపించడంతో రూ.20 లక్షలు నిధులు కూడా కేటాయించారు.

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీకే చెందిన స్టేషన్‌ ఘనపూర్‌ నేత కడియం శ్రీహరిపై రాజయ్య మొదటి నుంచి ఒంటి కాలితో లేస్తున్నారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అదే సమయంలో కడియం శ్రీహరి ఎక్కడా నోరు జారకుండా.. పార్టీ లైన్‌ మీరకుండా వ్యవహరించారు. దీంతో రాజయ్యకు సీటు ఈసారి కష్టమేనని తేలిపోయింది.

దీంతో రాజయ్య అప్రమత్తమయ్యారు. కేసీఆర్‌ సీట్ల ప్రకటనకు ముందు నుంచే ఆయన, ఆయన మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. రాజయ్యకే సీటు ఇవ్వాలని మద్దతుదారులు కోరారు. ఇంకోవైపు రాజయ్య తన సీటు కోసం రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రాజయ్యకు కేసీఆర్‌ సీటు నిరాకరించారు. ఆ సీటును కడియం శ్రీహరికి కేటాయించారు. దీంతో స్టేషన్‌ ఘనపూర్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాజాగా తన మద్దతుదారులతో సమావేశమైన ఆయన బోరుమని ఏడ్చేశారు. జనగామలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర వర్షంలోనే తడుస్తూనే కాసేపు మౌనదీక్ష చేశారు. ఆ తరువాత తన వద్దకు వచ్చిన కార్యకర్తలపై పడి రాజయ్య రోదించారు. దీంతో కార్యకర్తలు కూడా కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య కార్యకర్తలంతా సంయమనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలన్నారు. కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని కోరారు. 2001 నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్‌ ను తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రమ్మంటే ఆయన చెప్పిన మాట విన్నానని గుర్తు చేశారు. నీ స్థాయికి తగ్గట్టుగా అవకాశం ఇస్తాను అని ఆయన మాట ఇచ్చారన్నారు. అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. అధినాయకుడు చెప్పినట్లుగా ఏ పని చెప్పినా తూచా తప్పకుండా పనిచేస్తానని రాజయ్య వెల్లడించారు.

Tags:    

Similar News