ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ లో కలవరానికి కారణం అదేనా?

కాగా కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నవారి సంఖ్య 3 శాతం పెరగడం విశేషం. మరోవైపు బీజేపీకి మద్దతిస్తున్నవారి సంఖ్య కూడా పడిపోయింది

Update: 2023-08-29 08:59 GMT

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కే సీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందుగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకుగానూ 115 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించారు. ఇంకా నాలుగు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కేసీఆర్‌ ఆశించింది ఒకటి అయితే జరుగుతోంది మరొకటి అని అంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టికెట్లు రానివారు, టికెట్లపై ఆశపడ్డవారు, తదితరులంతా బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌ లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ ఆచితూచి అడుగులేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత రైతు రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు కేసీఆర్‌ హడావుడి చేస్తున్నా బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ ఏమీ పెరగలేదని తాజాగా వెల్లడైంది. లక్ష రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం మాఫీ చేస్తోంది. అయితే ఇందువల్ల బీఆర్‌ఎస్‌ కు రైతుల్లో ఆదరణ ఏమీ పెరగలేదని తేలింది. రైతు రుణమాఫీని ఎన్నికల స్టంట్‌ గానే ప్రజలు భావిస్తుండటం విశేషం.

ముఖ్యంగా, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ వేగంగా తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. కేవలం రెండు వారాల్లోనే బీఆర్‌ఎస్‌ కు 3 శాతం ప్రజల మద్దతు తగ్గిందని తాజా సర్వే ఒకటి సూచిస్తోంది.

తాజాగా తెలంగాణ ఇంటెన్షన్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన సర్వేలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 51 శాతం మంది ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం 38 శాతం మంది మాత్రమే సానుకూలతను వ్యక్తం చేశారు.

కాగా కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నవారి సంఖ్య 3 శాతం పెరగడం విశేషం. మరోవైపు బీజేపీకి మద్దతిస్తున్నవారి సంఖ్య కూడా పడిపోయింది. 3.5 శాతం ప్రజామద్దతు బీజేపీకి తగ్గిపోయిందని తెలంగాణ ఇంటెన్షన్స్‌ ఆర్గనైజేషన్‌ సర్వేలో వెల్లడైంది.

అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల తర్వాత, అది కూడా ఎన్నికల ముందు కేసీఆర్‌ రైతు రుణమాఫీకి పూనుకున్నారు. 2018లో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి ఉంటే చాలా మంది రైతులు అప్పులు, వడ్డీల భారం నుంచి విముక్తలయ్యేవారు. అలా చేయకపోవడం వల్ల గత నాలుగున్నరేళ్లుగా రైతులు తాము తీసుకున్న రుణాలతోపాటు వడ్డీలను కూడా చెల్లించాల్సి వస్తోంది. అది కూడా తెలంగాణలో 20 ల„ý ల మంది రైతులు ఉంటే అందరికీ ఒకేసారి కాకుండా తీసుకున్న రుణాలను బట్టి విడతల వారీగా రుణమాఫీ చేస్తుండటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉన్న దళిత ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలాగే కేసీఆర్‌ అప్పటికప్పుడు దళిత బంధు పేరుతో హడావుడి చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఈటల రాజేందర్‌ ను ఓడించడానికి కొంతమందిని ఆ నియోజకవర్గంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో పది లక్షల రూపాయల చొప్పున కేసీఆర్‌ వేయించారు. ఆ తర్వాత మళ్లీ దళిత బంధును లైట్‌ తీసుకున్న ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజా సర్వే రేపిన ప్రకంపనలతో బీఆర్‌ఎస్‌ లో కలవరం మొదలయ్యిందని అంటున్నారు. నియోజకవర్గాల్లో అసంతృప్తులు, రెబల్స్‌ బెడద ఎక్కువ ఉండటంతో ఈ ప్రభావం కూడా వచ్చే ఎన్నికల్లో తీవ్రంగానే ఉంటుందని చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, రెబల్స్‌ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమని.. దీంతో బీఆర్‌ఎస్‌ పుట్టి మునగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News