కాంగ్రెస్ ఆ నిర్ణయం.. బీజేపీ, బీఆర్‌ఎస్ లకు భారీ షాకే!
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తే బీఆర్‌ఎస్, బీజేపీలకు పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో విజయం సాధించి సొంతంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే మ్యాజిక్కును రిపీట్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలంతా సంయుక్తంగా విభేదాలను వీడి ముందుకు కదులుతున్నారు. దీంతో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.
ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ వంటి వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ వంటివారు కూడా కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ దూకుడును కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడానికి నిర్ణయించిందని అంటున్నారు.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించడంతోపాటు సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభను నిర్వహించే ప్లాన్ లో ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తుందని చెబుతున్నారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీలోని ఇతర సీనియర్ నేతలు కూడా హాజరవుతారని చెబుతున్నారు.
అలాగే ఇప్పటికే కర్ణాటకలో ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తోంది. ఇప్పుడు కర్ణాటక మోడల్ నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తాము చేపట్టబోయే పథకాల గురించి వివరిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, దళిత బంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేతలంతా హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోని కూడా విడుదల చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
ఇక సెప్టెంబర్ రెండో వారం నుంచి ఉధృతంగా రాహుల్ గాంధీ, ప్రియాంకలు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిస్తారని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తే బీఆర్‌ఎస్, బీజేపీలకు పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో సీట్లు లభించనివారు కేసీఆర్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. అసంతృప్త నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు.
మరోవైపు బీజేపీకి అభ్యర్థుల కొరత ఉంది. ఆ పార్టీలోకి చేరికలు ఆగిపోయాయి. దీంతో ఆ పార్టీ పరిస్థితి బలహీనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.