టిక్ టాక్ పై ట్రంప్ కీలక ప్రకటన.. 50 శాతం వాటా ఇవ్వాల్సిందే!
బ్యాన్ ముప్పుు ఎదుర్కొంటున్న చైనా దిగ్గజ యాప్ టిక్ టాక్ పై మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
బ్యాన్ ముప్పుు ఎదుర్కొంటున్న చైనా దిగ్గజ యాప్ టిక్ టాక్ పై మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలని.. లేదంటే దాన్ని అమెరికన్లకు అమ్మేయాలంటూ నిర్ణయాన్ని అమెరికా కోర్టులు సైతం ఇవ్వటం తెలిసిందే. దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి వేళ.. తాజాగా టిక్ టాక్ పై ట్రంప్ స్పందించారు. టిక్ టాక్ కంపెనీలో కనీసం 50 శాతం మాటాను అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండే షరతుతో టిక్ టాక్ సేవల్ని పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. టిక్ టాక్ పై బ్యాన్ అమల్లోకి రాకముందే సమయాన్ని పొడిగిస్తున్నామని.. అమెరికా భద్రతకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ఉమ్మడి వెంచర్ లో 50 శాతం వాటా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనికి వారు అంగీకరిస్తే తాము టిక్ టాక్ ను రక్షిస్తామని చెప్పారు.
టిక్ టాక్ ఉత్తంగా నడిపే వారి చేతుల్లోకి వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ట్రంప్.. దాని సేవల్ని తాము అనుమతిస్తామన్నారు. ఈ వివరాల్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ లో వెల్లడించారు. 2025, జనవరి 19 నాటికి టిక్ టాక్ ను అమ్మేయాలని అమెరికా ప్రతినిధుల సభ ఒక బిల్లును గతంలోనే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఒకవేళ.. తాము నిర్ణయించిన టైంలోపు టిక్ టాక్ ను అమ్మేయకుంటే దానిపై బ్యాన్ విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ప్రతినిధుల సభతో పాటు అమెరికా సుప్రీంకోర్టు సైతం టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కు డెడ్ లైన్ విధించారు.
ఈ నేపథ్యంలో టిక్ టాక్ సేవల్ని ఆపేస్తున్నట్లుగా సంస్థ తన అమెరికన్ యూజన్లకు సమాచారాన్ని అందించింది. గూగుల్.. యాప్ సంస్థలు తమ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించాయి. ఇలాంటి వేళలోనే కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బ్యాన్ కు సంబంధించిన అంశంలో కొద్దిపాటి డిస్కౌంట్ ను ఇచ్చిన ఆయన.. యాభై శాతం వాటాను అమ్మేయాలన్న సూచన చేశారు.
ట్రంప్ ప్రకటనపై టిక్ టాక్ సంస్థ స్పందించింది. అమెరికాలో దీర్ఘ కాలం కంటిన్యూ అయ్యేందుకు వీలుగా పరిష్కారం కోసం ట్రంప్ తో కలిసి పని చేయనున్నట్లుగా పేర్కొంది. సేవల్ని పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. అమెరికాలో టిక్ టాక్ కు 17 కోట్ల మంది వినియోగిస్తున్నారు. 7 కోట్లకు పైగా చిరు వ్యాపారాలు డెవలప్ అయ్యేందుకు వీలు కల్పిస్తున్న ఈ ప్రొవైడర్లపై ఎలాంటి ఫైన్లు విధించకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ స్పష్టత.. హామీ ఇచ్చినట్లుగా టిక్ టాక్ పేర్కొంది. వెనువెంటనే నష్టం లేకున్నా.. తమ వాటాను ట్రంప్ పేర్కొన్నట్లుగా అమ్మేయాల్సిన టైం.. టిక్ టాక్ కు వచ్చేసిందని చెప్పాలి. ఏమైనా అగ్రరాజ్యం అనుకుంటే.. ఏదైనా దాని సొంతం కావాలన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే. అగ్రరాజ్యమా.. మాజాకానా?