ప్రయాగ్ రాజ్ లో పేలిన 2 గ్యాస్ సిలిండర్లు.. లక్కీగా బయటపడ్డారు
అగ్నిప్రమాదం గురించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. 'మహా కుంభమేళాలో సెక్టార్ 19 వద్ద గుడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి.
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆదివారం భక్తుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ తీవ్రత ఎంతంటే 30 టెంట్లు కాలిపోయాయి.అయితే.. అప్రమత్తంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది కారణంగా మంటల్ని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా పొగలు వ్యాపించటంతో ఆందోళన వ్యక్తమైనా.. తీవ్రత పెద్దగా లేకపోవటం.. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవటంతో అందరూ గట్టిగా ఊపీరి పీల్చుకున్నారు.
రెండు సిలిండర్లు పేలిన ఘటనతో ఆందోళనకు గురైన భక్తులు.. ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నంతనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. సెక్టార్ 19లో జరిగిన ఈ అగ్నిప్రమాదం కాస్తంత ఆందోళనకు గురి చేసింది.
అగ్నిప్రమాదం గురించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. 'మహా కుంభమేళాలో సెక్టార్ 19 వద్ద గుడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ముందస్తుగా ఉంచిన అగ్నిమాపక వాహనాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గీతా ప్రెస్ కు చెందిన టెంట్లలోనే మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు’’ అంటూ పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన టెంట్లలో కొన్ని వస్తువులు మాత్రమే దగ్థమయ్యాయని.. ప్రమాదానికి కారణమైన గ్యాస్ సిలిండర్లు పేలిన ఉదంతంపై విచారణ చేస్తున్నట్లుగా డీఐజీ వైభవ్ క్రిష్ణ వెల్లడించారు. విచారణలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు పేలాయో తెలుస్తుందని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మహా కుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లుగా పేర్కొన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లుగా పేర్కొంటూ.. అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికు ఫోన్ చేసి వివరాలు అగిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల వేళలో మంటలు చెలరేగగా.. సమీపంలోని 18 టెంట్లకు మంటలు చాలా త్వరగా వ్యాపించాయి.
అయితే.. వేగంగా స్పందించిన అధికారయంత్రాంగం కారణంగా మంటల్ని వెంటనే ఆపేశారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి యూపీ మంత్రి ఏకే శర్మ వెల్లడించిన వివరాలు భిన్నంగా ఉన్నాయి. అందరూ రెండు సిలిండర్లు పేలినట్లుగా చెబుతుంటే.. ఆయన మాత్రం మూడు సిలిండర్లు పేలాయని.. మంటలు వ్యాపించిన 20 నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తెచ్చినట్లుగా చెప్పారు. అయితే.. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడ కేవలం వంద మంది మాత్రమే ఉండటం వల్ల పెద్ద ముప్పు త్రుటిలో తప్పినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.