అమిత్ షా కు షర్మిల సవాల్... తెరపైకి షాకింగ్ కామెంట్స్!

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ సమీపంలోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం,

Update: 2025-01-20 09:10 GMT

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ సమీపంలోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం, 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా... మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వ హయాం అనేది ఓ మానవ ప్రేరేపిత విపత్తు అని.. ఐదేళ్ల పాటు ఏపీలో ఆ విపత్తే సంభవించిందని.. దాని నుంచి రాష్ట్రాన్ని బయట పడేసేందుకు చంద్రబాబు-మోడీ జోడీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. అమిత్ షా పై నిప్పులు చెరిగారు.

అవును... ఏపీ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పై ప్రశ్నల వర్షం కురిపించారు.. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందంటూ పీసీసీ చీఫ్ షర్మిల స్టార్ట్ చేశారు.

‘వైసీపీ పాలన ఓ విపత్తు అయితే.. గత ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపితే ఒక్కనాడైనా ప్రశ్నించారా? రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా?’

‘సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోంమంత్రిగా ఎందుకు మౌనంగా ఉన్నారు? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? ఆ ఐదేళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా?’ అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఆ ఐదేళ్లు జగన్ మీకు దత్తపుత్రుడు’ అని అన్నారు.

ఇదే సమయంలో... ‘గత ఐదేళ్లు వైఎస్ జగన్ పాలన విపత్తు అయితే.. ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా..?’ అని ప్రశ్నించిన షర్మిల.. ‘పార్లమెంటులో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంపే కదా జగన్.. రాష్ట్రంలో సహజ వనరులను "మోదానీ"కి దోచిపెట్టే ఏజెంట్ జగన్’ అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ‘మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీని వాడుకొని.. రాష్ట్ర సంపదను దోచుకొని.. ఇప్పుడు విధ్వంసం అంటూ ముసలి కన్నీరు కార్చితే రాష్ట్ర ప్రజలు నమ్మరని.. 2019-24 జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే’ అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక.. ‘గత 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం.. రూ.3 లక్షల కోట్లు ఇస్తాం.. పూర్వ వైభవం తెస్తాం అనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం’ అని అన్నారు. ఈ సమయంలో.. మీకు ధమ్ముంటే గత ఐదేళ్ల జగన్ పాలనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించండి అని షర్మిల సవాల్ చేశారు.

Tags:    

Similar News