రాజయ్య యూటర్న్ఃకడియంకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా, అధికార బీఆర్ఎస్ పార్టీలో సద్దుమణుగుతోందన్న రచ్చ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా, అధికార బీఆర్ఎస్ పార్టీలో సద్దుమణుగుతోందన్న రచ్చ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరిని తమ అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించేశారు. దీంతో గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న వివాదం మళ్లీ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరిని కలిశారని రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారని గులాబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని రాజయ్య బాంబ్ పేల్చారు.
స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి తనను కాదని రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో హర్టయిన రాజయ్య గత కొద్దకాలంగా కడియంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం కలిసి ఉన్న ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారనేది ఆ ఫోటో సారాంశం. పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రాజయ్య వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పందించిన రాజయ్య అలాంటిది ఏం లేదని కొట్టిపారేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తున్నట్లు తాను ఎక్కడ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ను కలవడానికి హైదరాబాద్ వెళ్లానని.. అక్కడ కడియం శ్రీహరి కూడా ఉండటంతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అంతే తప్ప కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ బీఫామ్ రాకపోతే తన రాజకీయ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.దీంతో షాక్ తినడం బీఆర్ఎస్ పార్టీ నేతల వంతు అయింది.
బీఆర్ఎస్ పార్టీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ సమక్షంలోనే ఇద్దరు నేతలు కలిసినట్లు వార్తలు రావడం, అది జరిగిన 24 గంటల్లోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని రాజయ్య కొట్టి పారేయడం పైగా రాజయ్యకు మద్దతు ఇవ్వబోనని తేల్చిచెప్పేయడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో ముసలం తీవ్రస్థాయికి చేరిందని అంటున్నారు. ఇదే సమయంలో తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం రాజయ్య తదుపరి అడుగుల పట్ల ఉన్న క్లారిటీని చెప్తుందని అంటున్నారు.