తెలంగాణా ఎన్నికల్లో జగన్... ఎవరికి ప్లస్....?

తెలంగాణా ఎన్నికలు జరుగుతూంటే ఏపీలోని కొన్ని పార్టీలు ఆ వైపు చూస్తున్నాయి. పోటీకి కూడా టీడీపీ జనసేన సిద్ధపడుతున్నాయి

Update: 2023-10-16 04:17 GMT

తెలంగాణా ఎన్నికలు జరుగుతూంటే ఏపీలోని కొన్ని పార్టీలు ఆ వైపు చూస్తున్నాయి. పోటీకి కూడా టీడీపీ జనసేన సిద్ధపడుతున్నాయి. అయితే ఏపీలో బలంగా ఉంటూ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. నిజానికి చూస్తే వైసీపీకి తెలంగాణలో కొంత బలం ఉంది. 2014 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఆ పార్టీ గెలిపించుకుంది. అంతే కాదు నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని సెటిలర్స్ ఉన్న పాకెట్స్ లో వైసీపీ బలం ఉంది.

అయితే దాన్ని ఎపుడూ టెస్ట్ చేసుకోలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగానూ వ్యవహరించలేదు. కానీ ఏపీలో జగన్ తెలంగాణాలో కేసీయార్ ఇద్దరూ ఒక్కటిగా ఉంటారని, మంచి రిలేషన్స్ ఉన్నాయని ఒక భావన అయితే తెలంగాణాలోని ఒక బలమైన సమాజిక వర్గంలో ఉంది. అలాగే సెటిలర్లలోనూ ఉంది. అందుకే వారు కూడా గత రెండు ఎన్నికల్లో బీయారెస్ కి సపోర్ట్ గా ఉన్నారు.

అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకోవడంతో ఆ ప్రధాన సామాజిక వర్గం గట్టిగా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది అన్న భావన అయితే ఉంది. కానీ రాజకీయాలలో భావనలు వేరు రియాలిటీ వేరు. అందువల్ల ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ఉంటారు. తెలంగాణా ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టిన కేసీయార్ నోట జగన్ ప్రస్తావన వచ్చింది.

ఆయన బీయారెస్ ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేస్తూ సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో ఏపీని ముందుకు తెచ్చారు.ఏపీలో సామాజిక పెన్షన్లను ప్రతీ ఏటా పెంచుకుంటూ పోతామని అలా చివరి ఏడాది నాటికి మూడు వేలు చేస్తామని 2019 ఎన్నికల్లో జగన్ చెప్పారు. అలా చెప్పినట్లుగానే 2024 జనవరి నాటికి దానికి మూడు వేలకు చేస్తున్నారు.

దానినే కేసీయార్ ప్రస్తావిస్తూ ఏపీలో సక్సెస్ ఫుల్ గా జగన్ అమలు చేస్తున్నారని అదే ఫార్ములాతో తెలంగాణాలో కూడా 2028 నాటికి సామాజిక పెన్షన్లను అయిదు వేలకు పెంచుకుంటూ పోతామని ఇది దశల వారీగా అమలు చేస్తామని చెప్పడం విశేషం. ఇక్కడ ఈ పధకం గురించి చెబుతూ జగన్ సక్సెస్ ఫుల్ గా చేసారని ప్రస్తావించడం ద్వారా బీయారెస్ వ్యూహాత్మకంగానే ఏపీ సీఎం పేరుని తెచ్చిందని అంటున్నారు.

వైసీపీకి బలమైన వర్గం మద్దతు తెలంగాణాలో ఉంది. దానికి తోడు వైఎస్సార్ అభిమానులు దండీగా ఉన్నారు. అందుకే బీయారెస్ జగన్ గురించి మంచిగా ప్రస్తావిస్తోందని అంటున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వల్ల ఒక సెక్షన్ బాధపడితే మరో సెక్షన్ లో ఇదే ఇష్యూ మీద మరో రకమైన భావన ఉంది. అందుకే బీయారెస్ మొదట్లో న్యూట్రల్ గా ఉంది. అయితే టీడీపీ రచ్చ చేయడంతో అరెస్ట్ మీద సానుభూతి ఉంది అని చెప్పుకుంటూ వచ్చింది.

అదే సమయంలో వైసీపీ అనుకూల ఓట్లు అవసరం లేదా ఆ సెక్షన్ అభిప్రాయాలతో పని లేదా అన్న మరో పెద్ద చర్చ కూడా వచ్చింది. ఇపుడు అన్ని విధాలుగా అందరినీ మంచి చేసుకునే క్రమంలో బీయారెస్ వ్యూహం మార్చిందని అంటున్నారు. అందుకే సీమాంధ్రుల మద్దతు తమకే అని వారు ధీమాగా చెబుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద కచ్చితంగా కొన్ని చోట్ల కనిపిస్తాయనే అంటున్నారు. బీయారెస్ కూడా ఒకే వైపు మొగ్గు చూపకుండా కేంద్రంలోని బీజేపీ మాదిరిగా అటు జగన్ ఇటు చంద్రబాబుల విషయంలో న్యూట్రల్ గానే వెళ్తోందని అంటున్నారు.

Tags:    

Similar News