వారు కాదన్నారు.. వీరు రమ్మన్నారు.. జనం ఏమంటారు?
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత పబ్బతిరెడ్డి జనార్దన్‌రెడ్డి(పీజేఆర్) కుమారుడు పీ. విష్ణువర్ధన్‌రెడ్డికి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు దూకుడు నిర్ణయాలు తీసుకోవడం.. వారిని అధికార పార్టీ అక్కున చేర్చుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం యూటర్న్ తీసుకుంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడం.. ఆ వెంటనే వారిని బీఆర్ఎస్ సర్కారు నిముషాల వ్యవధిలో చేర్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీని డోలాయమానంలో పడేసిందనే టాక్ వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత పబ్బతిరెడ్డి జనార్దన్‌రెడ్డి(పీజేఆర్) కుమారుడు పీ. విష్ణువర్ధన్‌రెడ్డికి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో స్వతంత్రంగా ఆయన పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే.. విష్ణు రాజీనామా విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబురు పెట్టారు. రా.. చర్చించుకుందాం! అని చెప్పడంతో హుటాహుటిన విష్ణు కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఈయన బీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం రెడీ అయింది.
ఇక, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కూడా పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేశారు. విషయంపై సమాచారం అందగానే బీఆర్ఎస్ అగ్రనేతలు.. కేటీఆర్, హరీష్‌రావులు ఏకంగా నాగం ఇంటికి వెళ్లి.. ఆయనతో చర్చలు జరిపారు. వెంటనే పార్టీలోకి ఆహ్వానించా రు. దీనికి నాగం కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. కాంగ్రెస్ వద్దన్న వారిని బీఆర్ఎస్ చేర్చుకోవడం వరకు రాజకీయం ఓకే. కానీ, ప్రజలు వీరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది ఇప్పుడు ప్రశ్న.
ఏ పార్టీ అయినా.. కీలకమైన నాయకులను వదులుకునేందుకు సిద్ధం కాదు. ముఖ్యంగా అధికారంలోకి రావాలని, తెలంగాణ ఇచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మరింత జాగ్రత్తగానే ఉంది. అయినప్పటికీ.. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం, టికెట్ ఇచ్చినప్పటికీ గెలుస్తారనే నమ్మకం లేని వారిని అధిష్టానం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని బీఆర్ ఎస్ అక్కున చేర్చుకోవడం ఆశ్చర్యం కలిగించకపోయినా.. ప్రజలు వీరిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్న. ఇక, మరికొద్ది రోజుల్లో మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని జంపింగులు ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.