సస్పెన్షన్లు.. సవాళ్లు లేవు.. ఏపీ కంటే తెలంగాణ అసెంబ్లీ బెటరే
ఈసారి కూడా నవంబరు నాటికి ఎన్నికలు పూర్తయి డిసెంబరులో కొత్త సర్కారు కొలువుదీరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుండగా.. మరొక ప్రభుత్వం ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా.. మరొక రాష్ట్రంలో ప్రభుత్వం చివరి సమావేశాలకు దగ్గరగా ఉంది. వాస్తవానికి రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. అయితే, 2018లో తెలంగాణ సీఎంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ ఎన్నికలు ఆరు నెలలు ముందుకు జరిగాయి. ఈసారి కూడా నవంబరు నాటికి ఎన్నికలు పూర్తయి డిసెంబరులో కొత్త సర్కారు కొలువుదీరింది.
అసెంబ్లీ భేటీలో పరస్పరం భిన్నం
తెలంగాణలో గత రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటి సరళిని పరిశీలిస్తే.. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులకు అవకాశం రాలేదనే అపవాదు ఉంది. మరోవైపు తొలిసారి బీఆర్ఎస్ సర్కారు బొటాబొటీ మెజార్టీతో ఏర్పడింది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల సభ్యులను గులాబీ దళంలోకి చేర్చుకున్నారు. తద్వారా ప్రతిపక్షాలను నైతికంగా బలహీనపరిచారు. అప్పటికీ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో గట్టిగానే బలం వినిపించారు. ఇక రెండోసారి 2018లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులను చేర్చుకోకుంటా ఉండలేదు. దీంతో మరోసారి విపక్షాల స్వరం తగ్గింది. అందులోనూ కీలక ప్రతిపక్ష నేతలను బీఆర్ఎస్ కలుపుకోవడంతో అసెంబ్లీ ఏకపక్షమైనట్లు కనిపించింది. 2018-23 మధ్య కాంగ్రెస్ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలతోనే నెట్టుకొచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీ ఎంత మాట్లాడినా స్వరం తక్కువగానే వినిపించేంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39 స్థానాలు దక్కాయి. ప్రస్తుత సమావేశాల్లోనే అసెంబ్లీలో అధికార-ప్రతిపక్షాల మధ్య వాతావరణం ఎలా ఉండనుందో స్పష్టమైంది.
సస్పెన్షన్లు ఉండవు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం చెప్పినదాని ప్రకారం అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్లు ఉండవు. అంటే.. మున్ముందు వాదోపవాదాలు భారీగా సాగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్, కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరకంగా ఇది ఆహ్వానించదగిన వాతావరణమే.
అప్పట్లో అలా..
2014-18 మధ్యన బీఆర్ఎస్ సర్కారుకు ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండేది. అందులోనూ రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ సభ్యుడు. ఆయనపై బీఆర్ఎస్ సర్కారు చాలా తీవ్రంగానే వ్యవహరించింది. సభ నుంచి సస్పెండ్ చేసింది. కానీ, అదే రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యారు. బీఆర్ఎస్ వారిపై సస్పెన్షన్లు ఉండవని.. సభలో కూర్చోబెట్టి కఠోర వాస్తవాలు వినిపిస్తామని అంటున్నారు. ఇక 2018లో కొడంగల్ నుంచి రేవంత్ పరాజయం పాలవడంతో అసెంబ్లీ లేని సంగతి తెలిసిందే.
ఏపీలో పూర్తి భిన్నం..
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఈ తీరున సాగుతుండగా.. పొరుగు రాష్ట్రమైన ఏపీలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి అని చెప్పక తప్పదు. 2014-19 మధ్యన టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో వైసీపీ తమకు అసెంబ్లీ సమయమే ఇవ్వడం లేదని ఆరోపించేది. మైక్ కట్ చేస్తున్నారంటూ అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ చెబుతుండేవారు. దీంతోనే ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించేవి. సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లేవారు. ఓ దశలో ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదంటూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరించారు. మళ్లీ సీఎం అయ్యేవరకు వారి సభ్యులు అసెంబ్లీకి రాలేదు.
ఈసారి చంద్రబాబు వంతు
2019 అనంతరం ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయినా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ సభ్యులు తీవ్రంగానే ప్రతిఘటించారు. ఈ కమ్రంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీంతో చంద్రబాబు తీవ్ర మనో వ్యథకు గురయ్యారు. మీడియా ఎదుట రోదించారు. తాను మళ్లీ సీఎం అయ్యేవరకు సభకు రానంటూ స్పష్టం చేశారు. అలా.. దాదాపు రెండేళ్ల నుంచి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టలేదు. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తానికి ఏపీతో పోల్చి చూస్తే.. తెలంగాణ కొత్త ప్రభుత్వంలో శాసన సభ సమావేశాలు చాలా అశావహంగా సాగాయి. మున్ముందు కూడా ఇలానే ఉంటాయని భావిద్దాం.