ఏడాదిలో తెలంగాణ బీజేపీకి మూడో చీఫ్.. ఈసారి ఈటల.. ఇదేం లెక్కనో?

కాంగ్రెస్ కు చేజేతులా పళ్లెంలో పెట్టి అధికారం అప్పగించింది. దీనికిముందే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-06-10 06:26 GMT

తెలంగాణ బీజేపీ.. మూడునాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా నానిన పేరు ఇది. అప్పటివరకు సాదాసీదాగా ఉన్న పార్టీని కేసీఆర్ ప్రభుత్వంపై బలమైన పోరాటం ద్వారా బండి సంజయ్ పైకి లేపారు. ఇంకేముంది..? గడీలు బద్దలుకొడతాం.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం.. అని చెప్పుకొచ్చారు. కానీ, 20 నెలల కిందట జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, అంతకుముందు జరిగిన ఫాంహౌస్ ల ఎమ్మెల్యేల కొనుగోలు కథతో అంతా అడ్డంతిరిగింది. మరోవైపు నవంబరు చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మరో 15కు పైగా సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. అయితే, అధికారంలోకి వచ్చేస్తామన్న పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ కు చేజేతులా పళ్లెంలో పెట్టి అధికారం అప్పగించింది. దీనికిముందే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

బండిని తప్పించడం ఎందుకో?

తెలంగాణలో బీజేపీకి కాస్తోకూస్తో దూకుడు నేర్పారన్న పేరున్న బండి సంజయ్ ను నిరుడు జూన్ లో అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ, తెలంగాణ ఏర్పడ్డాక కూడా పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనకు మరోసారి పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు మేలు చేసేందుకే బీజేపీ బండిని తప్పించిందనే ఆరోపణలు వచ్చాయి.

ఇప్పుడు ఈటల

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఈటల రాజేందర్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రి, బీజేపీ టాప్ లీడర్ అమిత్ షా ఈ మేరకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈటల మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. రాష్ట్ర పార్టీ పగ్గాలను మరొక నేతకు అప్పగించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయిన ఈటలకు పార్టీ చీఫ్ పోస్ట్ దక్కనుంది.

అప్పుడు రెండు బాధ్యతలు..? ఇప్పుడు?

కిషన్ రెడ్డికి నిన్నటివరకు, అది కూడా కీలక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ చీఫ్ రెండు బాధ్యతలను అప్పగించిన బీజేపీ అధిష్ఠానం.. ఇప్పుడు మాత్రం ఒకటే పదవి అంటోంది. ఇదెక్కడి సిద్ధాంతమో ఎవరికీ తెలియని పరిస్థితి. వాస్తవానికి కిషన్ రెడ్డి దూకుడుగా వెళ్లే నాయకుడు కాదు. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అయినా లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించారు. ఇప్పుడు ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు.

Tags:    

Similar News