కొత్త అధ్యక్షుడు వస్తాడా ? రాడా ?!

పూర్తి స్థాయి అధ్యక్షుడిని ప్రకటించని చోట ఆయా రాష్ట్రాలకు ఇంచార్జ్ లను నియమించారు. కానీ తెలంగాణ గురించి మాత్రం ఏ విషయం వెల్లడించడం లేదు

Update: 2024-07-31 12:30 GMT

తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ శ్రేణులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా కళ్లు కాయలు కాయడం తప్ప ఇప్పట్లో బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడిని నియమించే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవైపు కేంద్ర మంత్రిగా, మరో వైపు జమ్ముకాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఇంఛార్జ్ గా పనిచేస్తున్న కిషన్ రెడ్డి తెలంగాణలో పార్టీ రోజువారీ కార్యకలాపాల మీద దృష్టి సారించలేకపోతున్నాడు.

ఒక వ్యక్తికి ఒక్కటే పదవి అన్న పాలసీ ప్రకారం బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులుగా ఉన్న వారిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతల నుండి తప్పిస్తూ కొత్తవారిని నియమిస్తూ వస్తున్నది. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ప్రకటించని చోట ఆయా రాష్ట్రాలకు ఇంచార్జ్ లను నియమించారు. కానీ తెలంగాణ గురించి మాత్రం ఏ విషయం వెల్లడించడం లేదు.

పార్టీ అధ్యక్ష్య పదవి ఖాయం అని ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకె అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్ రావు, సీనియర్ నేతలు పేరాల చంద్రశేఖర్, ఆచారి తదితరులు ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పదవి ఇవ్వని నేపథ్యంలో నేడో రేపో ఈటెల రాజేందర్ నియామకం ఖాయం అన్న వార్తలు వెలువడ్డాయి.

కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కొత్త అధ్యక్షుడు వస్తారని తాజాగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఎనిమిది ఎమ్మెల్యే, ఎనిమిది ఎంపీ స్థానాలలో గెలిచిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ హుషారుగా ఉంది. అయితే రోజువారీ దిశానిర్దేశం లేకపోవడంతో వారిలో నిరుత్సాహం ఆవరిస్తుందని, భవిష్యత్తులో అధికారం ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చూయించకపోతే గెలుపు ఎలా సాధ్యమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరి బీజేపీ అధిష్టానం ఈ స్థానిక ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News