'తుపాకీ చెప్పినట్లే చేవేళ్లలో కాసాని'.. వరంగల్ లో కడియం కూతురు

లోక్ సభ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందనే ఊహాగానాల మధ్య ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి

Update: 2024-03-13 18:10 GMT

లోక్ సభ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందనే ఊహాగానాల మధ్య ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. బీజేపీ రెండో జాబితాలో మరో నలుగురు అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలోని 9 మందితో కలిపితే మొత్తం 13 మందికి టికెట్లిచ్చింది. నాలుగు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో నలుగురికి టికెట్లిచ్చింది. మలి విడత జాబితా ప్రకటించినా.. తెలంగాణ వారి పేర్లు లేవు. ఇక బీఆర్ఎస్ నలుగురికి తొలి విడతలో టికెట్లు ఖరారు చేయగా.. మలి విడతగా ఇద్దరిని ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లకు ఇప్పటివరకు పోటీలో ఉండేదెవరో స్పష్టం చేసింది. తెలంగాణలో 17 లోక్ సభ సీట్లున్న సంగతి తెలిసిందే.

తుపాకీ చెప్పినట్లే..

చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇక వరంగల్ (ఎస్సీ) నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ రెండూ సిటింగ్ సీట్లే. రెండు చోట్లా అభ్యర్థులను మార్చారు. చేవెళ్లలో ఎంపీగా ఉన్న జి.రంజిత్ రెడ్డిని, వరంగల్ లో పసునూరి దయాకర్ ను ఈసారి బరిలో దింపడం లేదు. 2014 ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం శ్రీహరి గెలిచారు. ఆయనకు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో వరంగల్ నుంచి పార్టీకి విధేయుడు, ఉద్యమకారుడైన పసునూరి దయాకర్ ను బరిలో దింపగా ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. 2019లోనూ విజయం సాధించారు. ఇప్పుడు మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇక రంజిత్ రెడ్డి పారిశ్రామికవేత్త. ఆయనకు టికెట్ ఇవ్వడంపై సందిగ్ధత ఎందుకనో తెలియదు కానీ.. బీజేపీ వైపు చూస్తున్నారన్నది కారణమై ఉండొచ్చు. వాస్తవానికి పనితీరు పరంగా రంజిత్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. టికెట్ ఇస్తే గెలిచేందుకు అవకాశమూ ఉంది. కానీ, కాసాని వైపు మొగ్గుచూపారు.

జ్ఞానేశ్వర్ వయా టీడీపీ

రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయిన కాసాని.. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2007లో పది మంది భారత రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ కోటా నుంలో ఎమ్మెల్సీ అయి సంచలనం రేపారు. అయితే, ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. మన పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. 2009లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుని 2009 సాధారణ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇటీవలి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడాన్ని తప్పుడు బీఆర్ఎస్ లో చేరారు.

Tags:    

Similar News