తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రాధాన్యం మళ్లీ పెరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విశ్రాంత ఐపీఎస్, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రాంమోహన్ రావు రచించిన ‘గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
76 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు, పరిణామక్రమాలను చూసి అవగాహన చేసుకున్న వారంతా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ద్వారా ఒకచోటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ లాంటి నేతలు జాతీయ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపడమే కాకుండా, శాసించే స్థాయికి ఎదిగారని ఆయన గుర్తు చేశారు. వీరి తర్వాత జైపాల్ రెడ్డి్డ, వెంకయ్యనాయుడు లాంటి వారు జాతీయ రాజకీయాల్లో కీలకంగా రాణించారన్నారు.
అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళితే మనవాళ్లు ఎవరున్నారని వెతికే పరిస్థితి ఉందని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అంశాల్ని జాతీయస్థాయిలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేయడానికీ మన తెలుగువారెవరూ ఢిల్లీలో కనిపించడం లేదన్నారు. వ్యాపారాలు చేస్తూ పార్ట్ టైమ్ గా రాజకీయాల్లోకి వచ్చే వారు పెరుగుతుండటం వల్లే ఇలా జరుగుతోందా అని అనిపిస్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు దేశ రాజకీయాల్లో మన భాషకు, నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగువారంతా కలిసి ప్రయాణం ప్రారంభిస్తే జాతీయ రాజకీయాల్లో రాణించగలరని నమ్ముతున్నానన్నారు. ఇది తెలుగువారి గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ఒకప్పుడు పదవుల్లో ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు సమతూకం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. పీవీ నరసింహారావుకు ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు నంద్యాల స్థానం నుంచి ఎన్టీఆర్ పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసేందుకు సహకరించారని తెలిపారు. రాజకీయాల్లో అప్పుడప్పుడూ మన తెలుగువారి ఉనికి, మనుగడ, గౌరవాలను నిలబెట్టడానికి ఇలాంటి సంప్రదాయాలను పాటించడంలో తప్పు లేదన్నారు. ఈ పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుంది అని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.