హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సెటిలర్లు హ్యాండివ్వలేదు.. అంకెల వాదన విన్నారా?
ఇక్కడ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా అధికార పార్టీకి రాలేదు. గ్రేటర్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నాగా తేలింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు షాకిచ్చి అధికారాన్ని సొంతం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రావటం తెలిసిందే. ఇక్కడ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా అధికార పార్టీకి రాలేదు. గ్రేటర్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నాగా తేలింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శల్ని మూటగట్టుకున్నారు సెటిలర్లు. ఎన్నికల వేళలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వేళ.. నిరసన వ్యక్తం చేసే వారిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు భగ్గుమనటమే కాదు.. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ది చెబుతామని తేల్చేశారు.
దీంతో.. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ అభ్యర్థులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. చంద్రబాబు అంటే తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్న బుజ్జగింపులతో పాటు.. తమపట్ల కోపాన్ని.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయొద్దని విన్నవించుకున్నారు. అయినప్పటికీ నో అంటే నో అంటూ తేల్చేసిన సెటిలర్లు.. ఎన్నికల్లో కాంగ్రెస్ కే తమ పూర్తి మద్దతు అని స్పష్టం చేశారు. ఓవైపు బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత.. మరోవైపు సెటిలర్లు సైతం గులాబీ పార్టీపై కత్తి కట్టిన నేపథ్యంలో.. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలాల్లో 7 మజ్లిస్ స్థానాలు..ఒక బీజేపీ స్థానాన్ని మినహాయిస్తే.. మిగిలిన 16 స్థానాల్లో ఆరేడు స్థానాల్లో విజయం ఖాయమని..తక్కువ వేసుకున్నా నాలుగైదు స్థానాల్లో తమ సత్తా చాటతారని భావించారు.
ఇందుకు భిన్నంగా గ్రేటర్ మొత్తంలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు కదా? సెటిలర్లు ప్రభావం చూపుతారని భావించిన స్థానాలతో పాటు మొత్త 16 స్థానాల్లోనూ బీఆర్ఎస్ దూసుకెళ్లింది. కాంగ్రెస్ కు గుండు సున్నా మిగిలింది. ఈ ఫలితాల అనంతరం సెటిటర్ల మీద తీవ్ర అసంత్రప్తితో పాటు.. ఆగ్రహం వ్యక్తమైంది. అన్నింటికి మించి.. బీఆర్ఎస్ వ్యతిరేక వాదనను బలంగా వినిపించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు.. కీలకమైన పోలింగ్ వేళ గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీకి ఓట్లు వేశారని.. ఈ కారణంగానే బీఆర్ఎస్ విజయం సాధించిందన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. సెటిలర్లు అంటే కమ్మ సామాజిక వర్గం మాత్రమే కాదు.. వివిద సామాజిక వర్గాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉంటారని.. అందరూ కలిస్తేనే సెటిలర్లు అవుతామే తప్పించి.. ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదన్న వాదనను వినిపించటం మొదలైంది. ఈ వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చేందుకు కొన్ని వాదనలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పోస్టు వైరల్ గా మారింది.
ఇందులో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల షేర్ ను చెబుతూ.. 2009 నుంచి ఇప్పటివరకుజరిగిన ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు.. తాజా ఎన్నికల్లో వచ్చిన ఓట్లను తెలుపుతూ కొన్ని గణాంకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. అందులో వారు వినిపించిన వాదనను చూస్తే..
2009లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.4 శాతం ఓట్ల షేర్ వస్తే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో (2023) 28 శాతం ఓట్లు వచ్చాయి. 2009 తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతంతో పోల్చినా కూడా 2023లో కాంగ్రెస్ కు హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓట్ల షేర్ పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేయగా.. ఆ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల షేర్ 33 శాతం అయితే.. కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 16.8 శాతం.
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ షేర్ 13.11 శాతం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఎన్నికల షేర్ 10.4 శాతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ.. కాంగ్రెస్ కు కలిసి 20శాత వస్తే.. 2020 జీహెచ్ఎంసీఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతం 6.6 శాతం. కాగా తాజాగా ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే.. 28శాతంగాచెప్పాలి. ఇదంతా చూసినప్ంపుడు కమ్మ సామాజిక వర్గం..సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా హ్యాండ్ ఇవ్వలేదన్న వాదనను తాజా గణాంకాలతో స్పష్టం చేస్తున్నారు. ఈ వివరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.