ఒక్క రోజులో వంద అప్లికేషన్లు.. లోక్ సభలో కాంగ్రెస్ టికెట్ల కోసం!
లోక్ సభకు పోటీ చేసే ఆశావాహులు శనివారం లోపు తమ దరఖాస్తుల్ని గాంధీభవన్ లో అందజేయాల్సి ఉంటుంది
త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వీలుగా టికెట్లను తమకు కేటాయించాలని కోరుతూ అప్లికేషన్లు పెట్టే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. శుక్రవారం ఒక్క రోజులోనే వివిధ నియోజకవర్గాల్లో తమను అభ్యర్థులుగా ఖరారు చేయాలని కోరుతూ అప్లికేషన్లు పెట్టుకున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఒక్క రోజులోనే వంద అప్లికేషన్లు రావటం చూస్తే.. కాంగ్రెస్ టికెట్ కోసం ఉన్న డిమాండ్ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
లోక్ సభకు పోటీ చేసే ఆశావాహులు శనివారం లోపు తమ దరఖాస్తుల్ని గాంధీభవన్ లో అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ ఎత్తున ప్రముఖులు.. .ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. రిజర్వుడు స్థానాలైన బహబూబాబాద్.. నాగర్ కర్నూల్.. వరంగల్.. పెద్దపల్లి నియోజకవర్గాలకు అత్యధికంగా దరఖాస్తులు రాగా.. హైదరాబాద్ కు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ రోజు దరఖాస్తులు దాఖలు చేసే వారి సంఖ్య మరింత పెరిగే వీలుందని చెప్పాలి. ఖమ్మం.. మల్కాజిగిరి.. నల్గొండలలో పార్టీ గెలుపు ఖాయమన్న ధీమా పలువురి నోట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే ఈ నియోజకవర్గాల టికెట్ల కోసం పలువురు పోటీ పడుతుండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రాష్ట్రంలోని ఎస్సీ.. ఎస్టీ రిజర్వు స్థానాల్లో టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ నడుస్తోంది. ఒక్కో అభ్యర్థి తమ వర్గానికి రిజర్వు అయిన అన్ని నియోజకవర్గాల్లో తనకు టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకోవటం ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
ఇక.. మిగిలిన వారిని పక్కన పెడితే.. గత ప్రభుత్వంలో ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా పని చేస్తూ.. ఇటీవల రిటైర్ అయిన డాక్టర్ గడల శ్రీనివాసరావు ఖమ్మం.. సికింద్రాబాద్ రెండు స్థానాల్లో ఏదో ఒకదానిలో టికెట్ తనకు కేటాయించాలని కోరారు. ఇక్కడ మర్చిపోకూడని అంశం ఏమంటే.. కేసీఆర్ సర్కారులోనూ అధికార పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు.. పడిన పాట్లు అప్పట్లో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. అధికారం చేతికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా గడతల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఏ ఎండకు ఆ గొడువు పట్టుకున్న సామెత గడలకు అతికినట్లుగా సరిపోతుందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.