ఒకటి తర్వాత ఒకటిగా హస్తగతమవుతున్న మున్సిపాలిటీలు
దీంతో.. నాయకుడు ఎవరైనా సరే అధికారం కావాలంటే అధికార పక్షంలోకి చేరిపోవాలన్నట్లుగా కాన్సెప్టును క్రియేట్ చేశారు
రాజకీయాలు మారిపోయాయి. గతానికి వర్తమానానికి అస్సలు పొంతన లేని పరిస్థితి. నేతలు ఎవరైనా.. ఏ స్థాయి అయినా సరే అధికారంలో భాగస్వామ్యం కావాలన్న ఆశ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. రేవంత్ రెడ్డి చేతికి అధికారం వచ్చిన నాటి నుంచి ఒక క్రమపద్దతిలో రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న మార్పులు మొత్తం కేసీఆర్ పుణ్యమేనని చెప్పాలి. ఇప్పటి బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలమైన నేతలందరిని గులాబీ కారులోకి ఎక్కించేయటం ద్వారా.. విపక్షాలకు ఉనికి చేయాలన్న వ్యూహాన్ని ఉద్యమం మాదిరి చేపట్టారు.
దీంతో.. నాయకుడు ఎవరైనా సరే అధికారం కావాలంటే అధికార పక్షంలోకి చేరిపోవాలన్నట్లుగా కాన్సెప్టును క్రియేట్ చేశారు. దీంతో.. విశ్వసనీయత.. విశ్వాసం ఉన్న వారి కంటే కూడా అధికారాన్ని అందిపుచ్చుకోవటానికి వచ్చినోళ్లే ఎక్కువ అయ్యారు. దాని ఫలాల్ని ఇప్పుడు కేసీఆర్ బాగానే అనుభవిస్తున్నారు. కేసీఆర్ నేర్పిన పాఠాల్ని.. నడిచిన దారినే రేవంత్ ఎంచుకున్నారు. తన చేతికి వచ్చిన అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బొటాబొటిగా వచ్చిన అధిక్యతపై ఫలితాలు వెలువడిన మూడో రోజు నుంచే రేవంత్ ప్రభుత్వం అధికారంలో ఎక్కువ కాలం ఉండదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీన్నో అవకాశంగా మలుచుకున్న రేవంత్.. తనను బెదిరిస్తూ.. తన ప్రభుత్వాన్ని కూలదోసే వ్యూహాన్ని అమలు చేసే గులాబీ బాస్ కు ఆయనకు అర్థమయ్యే తరహాలో షాకులు ఇస్తానంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు మొదలుకొని నేతల వరకు అందరిని ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు.
ఇప్పటికే పలు మున్సిపాలిటీల్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్.. తాజాగా మూడు మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. జిల్లా కేంద్రమైన వనపర్తి.. సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరితో పాటు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీని సైతం సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ కింద ఉన్న ఈ మూడు మున్సిపాలిటీలకు చెందిన నేతల్ని తమవైపు తిప్పుకోవటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఏలుబడిలోకి వెళ్లాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ నేతలకు జై కొట్టటంతో మున్సిపాలిటీలు హస్తగతమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ రోజు మరింత పెరగటం ఖాయమని చెప్పాలి.