పోటీ అక్కడే.. పార్టీనే వేరు!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను మెజారిటీ చోట్ల జెండా ఎగరేయాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో నాయకుల జంపింగ్‌లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కానీ బీఆర్ఎస్‌లోకి వచ్చే నాయకుడే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 9 మంది మాత్రమే సిటింగ్ ఎంపీలు నిలబడ్డారు.
బీఆర్ఎస్‌కు చెందిన తొమ్మిది మంది సిటింగ్ ఎంపీల్లో అయిదుగురు పార్టీ మారడం గమనార్హం. ఇక ఇందులో ఇద్దరు ఎంపీలు అదే నియోజకవర్గం నుంచి వేరే పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జి.రంజిత్ రెడ్డి విజయం సాధించారు. కానీ ఇప్పుడాయన అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఇక జహీరాబాద్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీబీ పాటిల్ ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. కాషాయ పార్టీ తరపున సమరానికి సై అంటున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఈ సారి పోటీ చేయడం లేదు. ఇక నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ సారి తన తనయుడు భరత్ ప్రసాద్‌ను బీజేపీ తరపున పోటీలో నిలబెట్టారు. ఇక వరంగల్ లోక్‌సభ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారేమో అనుకున్న కడియం కావ్య ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికల క్షేత్రంలో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల కారణంగా తెలంగాణలో రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి.