ఎన్నికలను అడ్డంపెట్టుకుని ధరణి పోర్టల్ ద్వారా కేసీయార్ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిజమే అని తేలింది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటవ్వటం ఖాయమని తేలిపోయింది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ మధ్య అంటే నాలుగు రోజుల్లోనే కేసీయార్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా పెద్దఎత్తున భూదోపిడీకి పాల్పడిందని రేవంత్ రెడ్డి అండ్ కో ఆరోపణలు గుప్పించారు.
అప్పట్లో ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం ఏమిటో ఎవరికీ తెలీదు. అయితే తాజాగా బయటపడిన వివరాల ప్రకారం ధరణిని అడ్డం పెట్టుకుని కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. మాదుల మండలం, మహేశ్వరం మండలంలో అనేక వివాదాస్పద భూములున్నాయి. భూదాన్ భూములు, కోర్టు కేసులు, అసైన్డ్ భూములు, మ్యూటేషన్, పాస్ పుస్తకాల్లో మార్పులకు పెట్టుకున్న థరఖాస్తుల భూముల్లో పెద్దఎత్తున మార్పులు జరిగిపోయినట్లు సమాచారం. దరణి పోర్టల్లో దరఖాస్తుదారులకు అనుకూలంగా మార్పులు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
పై వివాదాలకు సంబంధించి ఇంతకాలం సుమారు 100 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిపైన విచారణ జరగకుండానే, ఎలాంటి రిపోర్టులు తయారుకాకుండానే దరఖాస్తుదారులకు అనుకూలంగా పోర్టల్లో మార్పులు జరిగిపోయాయట. ఈ మార్పులు కూడా పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చే మధ్యలోని నాలుగు రోజుల్లోనే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారన్న కారణంతో అప్పటి కలెక్టర్ హరీష్ ను ఎన్నికల కమీషన్ సస్పెండ్ చేసింది. ఆయన స్ధానంలో భారతీ హొళికేరి బాధ్యతలు తీసుకున్నారు.
అయితే భారతి ఎన్నికల బిజీగా ఉండటంతో 100 దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే అదునుగా దరణి పోర్టల్ నిర్వహించే సిబ్బంది పోర్టల్లో 100 దరఖాస్తులకు అనుకూలంగా నిర్ణయం తీసేసుకుని మార్పులు చేసేశారని బయటపడింది. దాంతో ధరణి సమన్వకర్త నరేష్, ఆపరేటర్ మహేష్ ను అధికారులు సస్పెండ్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి.