తెలంగాణలో అన్ని పార్టీలకు నిరాశ ఖాయమా? ఎవరికి పూర్తి గెలుపు లేదా?

వరంగల్.. నల్గొండ.. ఖమ్మం స్థానాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ ఐదున మొదలు కానుంది

Update: 2024-05-31 05:17 GMT

ఇప్పుడు అందరి చూపు జూన్ నాలుగున వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల మీదనే ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఫలితాల వేళ ఏపీలో ఒకలాంటి పరిస్థితి ఉంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఖాయమంటున్నారు. దేశ వ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఉందంటున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అదే సమయంలో ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగటం తెలిసిందే. వీటన్నింటి ఓట్ల లెక్కింపు ఒకేసారి (ఎమ్మెల్సీ మినహాయించి) జరగనుంది. జూన్ నాలుగున లోక్ సభా స్థానానికి..సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు షఉరూ కానుంది.

వరంగల్.. నల్గొండ.. ఖమ్మం స్థానాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ ఐదున మొదలు కానుంది. జూన్ నాలుగున చేపట్టే ఓట్ల లెక్కింపు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చేసి.. రాత్రికి తుది ఫలితం మీద ఫుల్ క్లారిటీ వచ్చేయనుంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. జూన్ 5న మొదలయ్యే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆరు వరకు సాగనుంది. ఆరోతేదీ నాటికే తుదిఫలితంపై స్పష్టత రానుంది.

దీంతో దేశ వ్యాప్తంగా జరిగే ఓట్ల లెక్కింపునకు భిన్నమైన వాతావరణం తెలంగాణలో ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫలితాల వెల్లడిపై రాజకీయ వర్గాలు ఆసక్తికర వాదనలు సాగుతున్నాయి. ఎక్కువమంది నోటి నుంచి వినిపిస్తున్న అంచనాల ప్రకారం.. ఆశ.. నిరాశలకు మధ్యలో రాజకీయ పార్టీలు ఉండేలా ఈసారి ఎన్నికల ఫలితాలు ఉంటాయంటున్నారు. అదెలానంటే.. లోక్ సభా ఎన్నికల ఫలితాలు అంచనాలకు మించి ఉంటాయని.. బీజేపీకి అనుకూలంగా ఉంటాయంటున్నారు.

పోలింగ్ సరళిని చూసిన వారు.. అంతకు ముందు ఉన్న అంచనాల్ని సవరించుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఒక లెక్క ప్రకారం ఆరేడు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవచ్చని.. అనుకున్న రీతిలో మోడీ గాలి బలంగా వీస్తే మరో రెండు స్థానాలు అదనంగా కమలనాథుల ఖాతాలో పడినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది బీజేపీలో ఆశల్ని పెంచేలా చేస్తే.. అధికారపక్షం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారతుందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు విపక్ష బీఆర్ఎస్ కు తీవ్రమైన నిరాశకు గురి చేస్తుందని.. సమాధానం చెప్పలేని స్థితిలోకి పడినా ఆశ్చర్యం లేదంటున్నారు.

అధికార కాంగ్రెస్ విషయానికి వస్తే.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని.. విమర్శలు వెల్లువెత్తేలా ఉండటం ఖాయమంటున్నారు. లోక్ సభా ఎన్నికల ఫలితాలతో తీవ్రమైన నిరాశలోకి కూరుకుపోయే బీఆర్ఎస్ కు కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కాస్తంత ఉపశమనం ఇస్తుందని.. ఆ స్థానాన్ని గులాబీ పార్టీ వశమవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. అధికార కాంగ్రెస్ కు మరో దెబ్బగా మారనుంది.

లోక్ సభా.. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలతో రేవంత్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితుల్ని.. ఆఖర్లో వెల్లడయ్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం కాస్తంత రిలాక్స్ అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ గెలుపు ఉత్సాహానికి బ్రేకులు పడే వీలుంది. మొత్తంగా చూస్తే.. తెలంగాణలోని ప్రధాన పార్టీలందరికి కొంత నిరాశ.. అంతలోనే మరికాస్త ఆశ కలిగేలా తుది ఫలితాలు ఉంటాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News