రీ పోలింగ్ కు చాన్సే లేదు: సీఈవో వికాస్ రాజ్
చెదురుమదురు ఘటనల మినహా తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే
చెదురుమదురు ఘటనల మినహా తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. కామారెడ్డితో పాటు నరసాపూర్ వంటి కొన్ని ప్రాంతాలలో చిన్నచిన్న గొడవలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొన్నిచోట్ల రీపోలింగ్ జరపాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరుతున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్ స్పందించారు. రాష్ట్రంలో రీ పోలింగ్ కు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అన్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గిందని అన్నారు. 2018లో పోలింగ్ శాతం 73.37గా ఉందని, ఈసారి 70.74% పోలింగ్ జరిగిందని చెప్పారు. మునుగోడులో అత్యధికంగా 91% పోలింగ్ నమోదు అయిందని పేర్కొన్నారు. ఇక ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ ఫ్రమ్ హోమ్ సత్ఫలితాలనిచ్చిందని, 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని వెల్లడించారు. 3 కోట్ల 26 లక్షల ఓట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
దేవరకద్రలో 10 మంది ఓటర్లే ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, కొన్ని కేంద్రాలలో ఈవీఎంలు మార్చాల్సి వచ్చిందని అన్నారు. ఈవీఎంలను ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ కు తరలించామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. స్ట్రాంగ్ రూముల దగ్గర 40 సెంట్రల్ కంపెనీల బలగాలు పహారా కాస్తున్నాయని అన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ప్రతి టేబుల్ కు ఐదుగురు అధికారులు ఉంటారని అన్నారు.