తెలంగాణ వేడుకలకు ఆమె వస్తారు.. మరి ఆయన హాజరవుతారా?
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మరో రెండు రోజుల్లో 10వ పుట్టిన రోజును జరుపుకోనుంది
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మరో రెండు రోజుల్లో 10వ పుట్టిన రోజును జరుపుకోనుంది. అరవై ఏళ్ల కల.. మలి దశలో పదేళ్ల పోరాటం అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. దీనివెనుక ఉన్నది ఇద్దరు కీలక వ్యక్తులు. తెలంగాణ అనే పదమే పలికేందుకు అందరూ సంకోచిస్తున్న సమయంలో.. అధికారాన్ని వదులుకుని.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)( అంటూ ప్రత్యేక పార్టీని స్థాపించారు కె.చంద్రశేఖర్ రావు. ఆయన విధానాల్లో ఎన్నో లోపాలున్నా.. అంతిమ లక్ష్యం తెలంగాణ సాధించారు. ఇక సొంత అత్తగారు అయిన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని వివిధ కారణాలతో పక్కనపెట్టారు. కానీ, నాలుగు దశాబ్దాల తర్వాత నెరవేర్చారు సోనియా గాంధీ.
ఈ ఇద్దరిలో వచ్చేదెవరు?
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. తెలంగాణ వచ్చేందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు. అయితే, సోనియా ఆరోగ్య కారణాల రీత్యా బయటి కార్యక్రమాలను తగ్గించుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. రాజ్య సభకు ఎంపీగా వెళ్లారు. ఈ నేపథ్యంలో సోనియా తెలంగాణ ఆవిర్భావ వేడుకల వస్తారా..? అనేది చూడాలి. ఇప్పటికైతే సోనియా రాక ఖాయమే అని తెలుస్తోంది.
మరి కేసీఆర్ ?
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఉద్యమకారులను సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం చేసిన ఆహ్వాన లేఖను కేసీఆర్ కు ప్రభుత్వ ప్రతినిధులు అందజేయనున్నారు. అయితే, కేసీఆర్ వస్తారా? రారా? అనేది చర్చనీయాంశం. రాజకీయ విశ్లేషకుల అంచనా మేరకు ప్రభుత్వం పిలిచినా దశాబ్ది వేడుకలకు కేసీఆర్ రాకపోవచ్చు. విమర్శలకు తావు లేకుండా కేవలం లేఖ రూపంలో సందేశం ఇవ్వొచ్చు.
ఒకవేళ సోనియా, కేసీఆర్ ఇద్దరూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరైతే అదొక అరుదైన సన్నివేశమే.