కొత్త అసెంబ్లీ ఫైలు మల్లీ తెర మీదకు
విమర్శలు ఎన్ని ఎదురైనా తాను నిర్మించాలని డిసైడ్ అయిన వేళ.. సచివాలయాన్నికూల్చేసి మరీ దాని స్థానే కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే
ప్రజల మనసుల్ని ఎలా గెలుచుకోవాలి? అందుకు ఏమేం చేయాలి? తాము అధికారంలో ఉన్న వేళ.. గతంలోని ప్రభుత్వాలు చేయని ఎన్నో పనులు తాము మాత్రమే చేస్తున్నామన్న భావన కలిగేలా చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ప్రత్యేకమైన టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్.. తన ఏలుబడిలో పలు భారీ భవనాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.
విమర్శలు ఎన్ని ఎదురైనా తాను నిర్మించాలని డిసైడ్ అయిన వేళ.. సచివాలయాన్నికూల్చేసి మరీ దాని స్థానే కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. పాత భవనాన్ని కూల్చేసి కొత్తది కట్టటం ఏమిటి? అన్న విమర్శల్ని ఆయన ఖాతరు చేయలేదు. అయితే.. కొత్త సౌధాన్ని నిర్మించిన తర్వాత.. ప్రజలంతా అబ్బురపడిపోయి.. ఆనందపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త భవనం ముందు.. పాత భవనాన్ని అవసరం లేకున్నా కూల్చేశారన్న విషయాన్ని ప్రజలు మర్చిపోవటం చూస్తే.. కేసీఆర్ ఎత్తుగడ ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇప్పటికే పలు భవనాలు.. కట్టడాల్ని పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న పాత ఫైలును కొత్తగా కదిల్చినట్లుగా చెబుతున్నారు. నిజానికి కొత్త అసెంబ్లీ భవనాన్ని 2019లోనే శంకుస్థాపన చేసినప్పటికీ.. కోర్టు ఆదేశాల కారణంగా అడుగు ముందుకు పడలేదు. కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతోనే.. ఎర్ర మంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించాలని భావించినా.. హెరిటేజ్ కట్టడం అంటూ విమర్శలు రావటం.. కోర్టు ఆర్డర్ తో ఆ అంశం పక్కకు వెళ్లిపోయింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అధునాతన సౌకర్యాలతో కొత్త అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రకటనను ఆయన చేస్తారంటున్నారు. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న ప్రకటన చేయటం ద్వారా.. మరో ఐకానిక్ భవనం హైదరాబాద్ కు సొంతమవుతుందన్న భావన కలుగుతుందని.. ప్రజల్లో కూడా సానుకూలత వ్యక్తమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. దీని కారణంగా ఓట్లు పడతాయని చెప్పలేం కానీ.. కేసీఆర్ సర్కారు ఉంటే.. ఇలాంటి భవన నిర్మాణాలు షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉండటం కేసీఆర్ కు సానుకూలంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైలేజీ కోసం దేనికైనా సరే అనే కేసీఆర్ సర్కారు... అవసరానికి అనుగుణంగా కొత్త అసెంబ్లీ భవన ప్రకటనను మళ్లీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.