తెలంగాణా అసెంబ్లీలో జనసేన ఖాతా అక్కడ నుంచి...?

జనసేన ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించింది. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున రాపాక వరప్రసాదరావు గెలిచారు

Update: 2023-11-11 03:24 GMT

జనసేన ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించింది. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున రాపాక వరప్రసాదరావు గెలిచారు. ఆయన తరువాత కాలంలో వైసీపీలో చేరిపోయినా టెక్నికల్ గా మాత్రం జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నారు. అసెంబ్లీ రికార్డులలో అలాగే ఉంటుంది. సో అలా జనసేన ఏపీ అసెంబ్లీలో ఖాతా తెరచింది.

ఇపుడు జనసేన తెలంగాణా ఎన్నికల్లో పాల్గొంటోంది. మొత్తం ఎనిమిది సీట్లలో పోటీ చేస్తోంది. జనసేన తెలంగాణా ఎన్నికల్లో ఖాతా తెరుస్తుందా అన్న చర్చ అయితే ఉంది. దానికి జవాబు కూడా ఇపుడు వస్తొంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన తెలంగాణాలో పోటీకి దిగుతోంది.

ఎనిమిది సీట్లలో మెజారిటీ సీట్లను ఎలాగైనా గెలవాలని జనసేన చూస్తోంది. అయితే మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా జనసేనకు కూకట్ పల్లిలో ఆశలు సజీవంగా ఉన్నాయని అంటున్నారు. ఇక కూకట్‌పల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ లో దాదాపు 70 వేల మంది ఓటర్లు ఉన్న కాపు సామాజికవర్గంపై జనసేన చాలా పెద్ద ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు.

ఇక ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2018 ఎన్నికల్లో కాపులు, బలిజలు, తుర్పు, మున్నూరు కాపు సామాజికవర్గం బీఆర్‌ఎస్‌కు పెద్దఎత్తున ఓటు వేసిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈసారి జనసేన పోటీలోకి వచ్చింది. దాంతో కాపు సామాజికవర్గం తమ వైపు టర్న్ అవుతుందని భావిస్తోంది.

అలాగే ఏపీలో పొత్తు కారణంగా కమ్మ సామాజికవర్గం కూడా తమ వైపు ఉంటుందని భావిస్తోంది. ఇక టీడీపీ మద్దతుదారులు కూకటిపల్లిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో వారంతా జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తారని ఆ పార్టీ ధీమా పడుతోంది.

జనసేన నుంచి పోటీ చేస్తున్న వారు ప్రముఖ బిల్డర్ అయిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. చిత్రమేంటి అంటే ఈయన కేవలం ఒక్క రోజు ముందు బీజేపీ నుంచి జనసేనలో చేరి ఇక్కడ టికెట్ దక్కించుకున్నారు. ఈ సీటు జనసేనకు దక్కుతుందని అంచనా వేసి మరీ టికెట్ పొందారు అన్న మాట. ఇదే ప్రేమ్ కుమార్ ఒకప్పుడు టీడీపీలో కూడా ఉన్నారు.

దాంతో ఆయనకు స్థానికంగా ఉన్న టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన టీడీపీ మద్దతుదారులను ఆకట్టుకుంటారని భావిస్తున్నారు. ఇక ఆయన ప్రత్యర్ధిగా ఉన్నారు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. ఈయన ఇపుడు ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనపై గణనీయమైన వ్యతిరేకత ఉందని జనసేన భావిస్తోంది.

అంతే కాదు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ విషయం కూడా కలిసి వస్తుందని అంచనా వేసుకుంటోంది.కాంగ్రెస్ అభ్యర్ధి షేర్ లింగం పల్లి బీఆర్‌ఎస్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అలా ఆయన ప్రత్యర్ధిగా మారారు.

సరే ఈ లెక్కలు అన్నీ ఉన్నా కూడా కూకట్‌పల్లిలో జనసేన గెలవడం అనుకున్నంత సులభం అయితే కాదనే అంటున్నారు. ఎందుకంటే కాపు సామాజికవర్గం పోలరైజేషన్ అనేది చాలా సందర్భాలలో కనిపించేంత సులభం కాదని అంటున్నారు. అదే సమయంలో కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్ వైపు ఉందని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో వారూ వీరూ లేరు, కాంగ్రెస్ కే ఓటు అన్నట్లుగా ఆ సామాజికవర్గం ఒట్టు పెట్టుకుందని అంటున్న వారూ ఉన్నారు దాంతో ఆ వర్గం జనసేనకు మొగ్గు చూపుతుందా అనేది చూడాలని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ గ్రేఅఫ్ కూడా ఏమంత బాగా లేదు జనసేన బీజేపీ పొత్తు కూడా కమ్మలతో పాటు కాపులకూ ఆమోదయోగం కాదని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. ఆ ఏమైనా జరగవచ్చు అన్నది జరిగితే మాత్రం జనసేనా తెలంగాణా అసెంబ్లీలోకి వెళ్ళినట్లే అంటున్నారు.

Tags:    

Similar News