తెలంగాణ లిక్కర్ వేలంలో ఏపీ హవా ఎంత ఎక్కువంటే?
షెడ్యూల్ కంటే ముందుగా జారీ చేసిన తెలంగాణ మద్యం షాపుల వేలంలో ఈసారి భారీ దరఖాస్తులు రావటం తెలిసిందే.
షెడ్యూల్ కంటే ముందుగా జారీ చేసిన తెలంగాణ మద్యం షాపుల వేలంలో ఈసారి భారీ దరఖాస్తులు రావటం తెలిసిందే. రెండేళ్ల పాటు మద్యం దుకాణాల్ని నిర్వహించుకునేందుకు వీలుగా వేలానికి బిడ్లు ఆహ్వానించారు. గతంలో ఈ తరహా వేలానికి 68,691 అప్లికేషన్లు రాగా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 1,31,490 అప్లికేషన్లు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీగా అప్లికేషన్లు రావటం వెనుక ఏపీకి చెందిన మద్యం సిండికేట్లు భారీగా ఎంట్రీ ఇవ్వటమే కారణమని చెబుతున్నారు.
తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాల్ని సొంతం చేసుకోవటానికి ఏపీలోని రాజకీయ రంగానికి చెందిన పలువురు సిండికేట్లుగా ఏర్పడి.. తెలంగాణ మద్యం దుకాణాల వేలంలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. మద్యం దుకాణాల్ని సొంతం చేసుకోవటానికి వీలుగా ముందుగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీకి చెందిన వారు దాదాపు 7వేలకు పైగా దరఖాస్తుల్ని పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అప్లికేషన్లు దాఖలు చేసుకోవటానికి ఒక్కో అప్లికేషన్ కు రూ.2 లక్షల చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. అయినప్పటికీ వెనుకాడకుండా దాదాపు రూ.140 కోట్లకుపైగా అప్లికేషన్ ఫీజును ఏపీకి చెందిన నేతల సిండికేట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.
ఇలా అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత లాటరీ వేస్తారు. వీటిల్లో ఎవరికైతే దుకాణాలు వస్తాయో.. వారు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి.. ఆయా ప్రాంతాల్లో మద్యం షాపుల్ని ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుంది. లిక్కర్ షాపుల్ని పెద్ద ఎత్తున సొంతం చేసుకోవటానికి ఏపీకి చెందిన రాజకీయ నేతలుపలువురు సిండికేట్లుగా ఏర్పడి.. ఒక్కొక్కరు 500 నుంచి 2వేల వరకు దరఖాస్తులు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తినట్లుగా చెబుతున్నారు.
తూర్పు గోదావరికి చెందిన నేతల టీం ఒకటి సిండికేట్ గా వ్యవహరించి వెయ్యికి పైగా అప్లికేషన్లు పెట్టారని.. వారికి పది వరకు మద్యం దుకాణాలు లభించినట్లుగా చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీం ఒకటి 600 అప్లికేష్లు పెట్టగా.. వారికి కేవలం నాలుగు మద్యం దుకాణాలు మాత్రమే లభించటం గమనార్హం. విజయనగరం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి ఒక్కరే 150 అప్లికేషన్లు దాఖలు చేయగా.. కొన్ని షాపులు లాటరీలో లభించాయి.
మరోఆసక్తికరమైన విషయం ఏమంటే.. నెల్లూరు జిల్లాకు చెందిన రెండు సిండికేట్లు 250, 500లకుపైగా అప్లికేషన్లు దాఖలు చేస్తే.. ఈ రెండు సిండికేట్లకు నాలుగేసి చొప్పున షాపులు అలాట్ అయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ఏపీ నేతలు పలువురు.. తమ సిండికేట్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని పార్టనర్లుగా పెట్టుకోవటం ద్వారా సేఫ్ గేమ్ ఆడినట్లుగా చెబుతున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు పలువురు తెలంగాణ మద్యం షాపుల వేలంలో పెద్ద ఎత్తున పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. వ్యాపార వర్గాల్లో ఈ లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి.