కొండాకు కొండంత కష్టం!

ఇప్పుడు అంతా సార్వత్రిక ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది.

Update: 2024-05-04 08:07 GMT
కొండాకు కొండంత కష్టం!
  • whatsapp icon

ఇప్పుడు అంతా సార్వత్రిక ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు, అభ్యర్థులు ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు తమ ప్రత్యర్థులను ఓడించడానికి ఆ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. ప్రత్యర్థి పేరుతో ఉన్న అభ్యర్థినే బరిలో దింపి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చివరకు ఇంటి పేరుతో సహా ఒకే తరహా పేరున్న వ్యక్తులతో నామినేషన్లు వేయించి ప్రత్యర్థులను ఓడించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు స్థానాల్లో పలువురు అభ్యర్థులు తమ ప్రత్యర్థులను ఓడించడానికి వారి పేర్లతోనే ఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఇప్పుడిదే పరిస్థితి చేవెళ్ల లోక్‌ సభా నియోజకవర్గంలో వచ్చింది.

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి కొండంత కష్టం వచ్చింది. ఆయన బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఈవీఎంలో ఆయన పై నుంచి రెండో స్థానంలో ఉన్నారు. జాతీయ పార్టీలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈవీఎంలలో ఆ పార్టీల అభ్యర్థులే మొదటి స్థానాల్లో ఉంటారు.

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీలో ఉండటం, అది జాతీయ పార్టీ కావడంతో ఆయనకు రెండో స్థానం లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈవీఎంలో ఐదో స్థానంలో ఉన్న అభ్యర్థి కొండాకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ ఐదో స్థానంలో ఉన్న వ్యక్తి పేరు కూడా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డే కావడం గమనార్హం.

బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పోటీ చేస్తుండగా కొత్తగా రంగంలోకి దిగిన కొత్త వ్యక్తి.. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున బరిలో ఉన్నారు. ఈ కొత్త కొండాకు ఈవీఎంలో ఐదో స్థానం లభించడంతో మాజీ ఎంపీ, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు అయోమయానికి గురై ఐదో స్థానంలో ఉన్న కొండాకు ఓట్లేస్తే తన పరిస్థితి ఏమిటనేది ఆయన ఆందోళనకు కారణం.

దీంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ రెండు పేర్లు ఒకేలా ఉన్నాయని.. అంతేకాకుండా ఈవీఎంలో తమ పేర్లు సమీపంలోనే ఉన్నాయని.. దీనివల్ల తనకు నష్టం జరిగే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు.

ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్థానాన్ని ఈవీఎంలో మార్చాలని.. ఈవీఎంలో ఆయన స్థానాన్ని పది తర్వాతకు మార్చాలని విన్నవించారు.

అయితే ఇప్పటికే ఈవీఎంలు సిద్ధమైపోయాయని, ఇక మార్పులు చేయడానికి ఏమీ లేదని.. ఈ దశలో మార్పులు సాధ్యం కాదని ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి చుక్కెదురు అయ్యింది.

కాగా 2014లో చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి 2019లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News