తిరుమల సిఫార్సు లేఖలు అడిగే టీఎమ్మెల్యేలకు ఏపీ క్యాబ్ డ్రైవర్లు పట్టరా?

రాష్ట్రం విడిపోయింది. మీరు ఏపీ.. మేం తెలంగాణ అంటూ మాట్లాడే వారు కొందరుంటారు.

Update: 2024-08-08 04:58 GMT

రాష్ట్రం విడిపోయింది. మీరు ఏపీ.. మేం తెలంగాణ అంటూ మాట్లాడే వారు కొందరుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి ప్రకారం.. విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నదే సిద్ధాంతం. అలాంటప్పుడు విడిపోయిన తర్వాత చిన్న విషయాల్ని రచ్చ చేసే వారిని ఏమనాలి? విభజన వేళ ఎవరు లాభ పడ్డారు? ఎవరు నష్టపోయారన్నది అదో పెద్ద సబ్జెక్టు. దాన్ని పక్కన పెట్టేద్దాం. విడిపోయిన తర్వాత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇద్దరికి ఉండాలి. కానీ.. ఈ ఇష్యూలో ఏపీ అడిగే దాని కన్నా.. తెలంగాణ పాలకులు.. ప్రజాప్రతినిధులు కోరుకునేది ఎక్కువ.

మొన్నటికి మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ భేటీ సందర్భంగా.. ఏపీలోని పోర్టు ఒకటి ఇవ్వాలని.. సముద్రతీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని.. ఇలా విన్నంతనే పడి పడి నవ్వే కొన్ని సిత్రమైన డిమాండ్లను తెర మీదకు తెచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి.. ఈ సమాచారాన్ని రేవంత్ సర్కారే మీడియాకు ఉప్పందించినట్లుగా చెబుతారు. విడిపోయిన పదేళ్ల తర్వాత ఏపీ నుంచి ఇన్నేసి కోరుకునే వారు.. తాము ఏం ఇస్తున్నామన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతారన్నది ప్రశ్న.

తాజాగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిశారు హైదరాబాద్ లోని ఏపీ క్యాబ్ డ్రైవర్లు. దాదాపు 2 వేల మంది వరకు ఉండే ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లను.. తెలంగాణలో ఉండొద్దంటూ అక్కడి క్యాబ్ డ్రైవర్లు హుకుం జారీ చేయటంపై వారు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు పొమ్మంటే తమ పరిస్థితేమిటంటూ వాపోతున్నారు. తమకు అండగా ఉండాలని కోరుకున్నారు. దీనికి స్పందించిన పవన్.. రేవంత్ సర్కారుతో మాట్లాడతానని చెప్పటమే కాదు.. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లను రిక్వెస్టు చేయటం కనిపిస్తుంది.

ఇక్కడే.. ఒక విషయం చర్చకు వస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణకు చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి.. ఏపీలోని తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని పరిగణలోకి తీసుకునేలా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. టీటీడీ తమ లేఖల్ని పట్టించుకోవటం లేదని వాపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని టీటీడీ పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్న వేళ.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? వారికి ఎందుకు అండగా నిలవరు?

విడిపోయిన తర్వాత కూడా ఏపీకి చెందిన పలు అంశాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరే తెలంగాణ ఎమ్మెల్యేలు.. తాము కూడా అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలన్న ఆలోచన ఎందుకు చేయరు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న సామెత తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలీదా? ఇప్పటికైనా ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్ల గోసకు స్పందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News