ఓటర్ నమోదుకు లైట్.. నాడు 5లక్షలు.. ఇప్పుడు 53వేలే?
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అయిన కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అయిన కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మూడేళ్ల క్రితం ఉమ్మడి నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పల్లా.. ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, వామపక్షాల అభ్యర్థి జయసారధిల మీద గెలుపొందటం తెలిసిందే. అప్పట్లో పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలవగా.. ప్రొఫెసర్ కోదండరాం మాత్రం మూడో స్థానంలో నిలిచారు.
నిజానికి అప్పట్లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నిక భారీ పోరును తలపించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా ఓటర్ల నమోదు మొదలు.. ఓట్లు వేసేందుకు వారిని తరలించిన వైనానికి భిన్నంగా తాజా పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికలసమయంలో పోటాపోటీగా ఓటర్ల నమోదు కారణంగా దాదాపు 5 లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. కానీ.. తాజాగా జరిగే ఉప పోరు వేళ.. ఇప్పటికి ఓటర్ల నమోదు కేవలం 53 వేలకే పరిమితం కావటం అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఎందుకింత అనాసక్తి అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
గత ఎన్నికల వేళ.. ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పల్లాతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నలు ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ప్రత్యేకంగా టీంలను భారీగా ఏర్పాటు చేసి మరీ ఓట్ల నమోదు అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో భారీగా ఓటర్లు నమోదయ్యారు. అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎవరిలోనూ పెద్దగా ఆసక్తి కనిపించకపోవటంతో పాటు.. పార్టీలు సైతం పెద్దగా పట్టించుకోకపోవటం తాజా అనాసక్తికి కారణమని చెబుతున్నారు. దీనికి తోడు కొత్తగా రేవంత్ సర్కారు కొలువు తీరటం.. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేని నేపథ్యం కూడా తాజా అనాసక్తికి కారణమంటున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికకు సంబంధించి ఓటు వేసేందుకు వీలుగా ఓటర్లు ఎప్పటికప్పుడు తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఓటుహక్కు ఉన్న వారు సైతం.. ఫారం 18 ద్వారా విధిగా ఫిబ్రవరి ఆరో తేదీ లోపు ఓటుహక్కు కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా కానీ ఆఫ్ లైన్ ద్వారా కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 2020 నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారంతా కూడా ఓట్లు వేసేందుకు అర్హత సాధిస్తారు. ఓట్ల నమోదుకు ఫిబ్రవరి 6 చివరి తేదీ కాగా.. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటరు జాబితా.. ఏప్రిల్ 4న తుది జాబితాను ప్రచురిస్తారు.
మూడేళ్ల క్రితం 5.05 లక్షల మందికి పైగా ఓటుహక్కు కోసం అప్లై చేయటం తెలిసిందే. ఈ కారణంగా గత ఎన్నికల్లో 5,05,565 మంది ఓటుహక్కు సాధించారు. వీరిలో పురుషులు 3.32 లక్షలు అయితే.. మహిళలు 1.72 లక్షలు. తాజాగా జరుగుతున్న ఉప పోరులో ఇప్పటివరకు కేవలం 53 వేల మందే తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా ప్రచారం మొదలు పెట్టారు. మొత్తంగా ఓటర్ల నమోదులో కనిపిస్తున్న అనాసక్తి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.