ఏపీకి పదేళ్ల నష్టం కనిపించదా? ఇదేం అక్రోశం?

దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు కొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వరకు ఇదే తీరును ప్రదర్శించటం అభ్యంతరకరం.

Update: 2024-07-24 05:23 GMT

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదేళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరికి పట్టలేదు. విభజన గాయాలతో తల్లడిల్లుతున్న విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయ్యో అన్న మాటే లేదు. అలాంటిది పదేళ్ల తర్వాత కాలం తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఏపీకి ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూసింత ప్రాధాన్యత ఇవ్వటం కొంత రిలీఫ్ గా చెప్పాలి. అయితే.. ఈ తీరుపై తెలంగాణ నేతలు స్పందిస్తున్న తీరు అభ్యంతరకరంగా చెప్పాలి.

తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలపై ఏపీ నేతలు ఎప్పుడూ అభ్యంతరం తెలిపింది లేదు. అదే సమయంలో మాకు ఇవ్వరు కానీ తెలంగాణకు ఇస్తారన్న మాట అన్నది లేదు. అయితే గియితే.. తెలంగాణకు ఇచ్చారు.. సంతోషం.. ఏపీని కూడా అదే తరహాలో ఆదుకోండన్న మాట వచ్చేది. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు మాత్రం.. ఇదేం అక్రోశం అన్న భావన కలుగక మానదు. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు కొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వరకు ఇదే తీరును ప్రదర్శించటం అభ్యంతరకరం.

మనకు దక్కని వాటి గురించి ఒకలాంటి బాధ ఉంటుంది. కాదని చెప్పలేం. కానీ.. పక్కనోడికి ఏదైనా లాభం జరిగినప్పుడు.. వారికి లాభం జరిగింది.. మాకు జరగలేదన్న మాట మంచిది కాదు. ఎందుకుంటే.. లాభం జరిగినప్పుడు మాట్లాడుతున్న వాళ్లు.. ఏపీకి గడిచిన పదేళ్లుగా జరిగిన నష్టం గురించి మాట్లాడింది లేదు. ఏపీకి.. బిహార్ కు పెద్ద పీట ఎందుకు వేశారన్న ప్రశ్నను సంధించే రాజకీయ అధినేతలకు.. రాజకీయ క్రీడలో అలాంటివి సర్వసాధారణం అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అంతేకాదు.. ఈ తరహా ప్రకటనలు రెండు తెలుగు రాష్ట్రాల బంధాలపై ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే విభజన గాయాల కుప్పగా పడి ఉన్న ఏపీకి.. ప్రత్యేకంగా సాయం చేయకున్నా ఫర్లేదు. కానీ.. కేంద్రం ద్వారా జరిగే లబ్థిని తప్పుగా చూపించటం ఇబ్బందే అవుతుంది.

రాజకీయంగా చూసినప్పుడు ఏపీకి లాభం జరిగింది.. తెలంగాణకు నష్టం వాటిల్లిందన్న ప్రకటనలు రాజకీయంగా లబ్థి చేకూర్చటంతో పాటు.. తెలంగాణ ప్రజల్లో మైలేజీ పెరిగే వీలుంది. ఆ కారణంగా.. ఏపీని అదే పనిగా ప్రస్తావించటం కూడా సరికాదన్నది గుర్తించాలి. కేంద్రం నుంచి అందే నిధులు మొత్తం రాజకీయ సమీకరణాల ఆధారంగా మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కేంద్రం నుంచి తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా గురించి తెలంగాణ ప్రభుత్వం.. రాజకీయ పార్టీలు పోరాటం చేయటం తప్పేం కాదు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు కూడా. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పేరును తీసుకురావటం మీదనే అసలు అభ్యంతరమన్న విషయాన్ని మరవకూడదు. మన వేదన మనకు చెందిందే ఉండాలే తప్పించి.. పక్కనోడికి ఏదో లాభం జరిగిందన్నట్లుగా ఉండొద్దు. ఈ తరహా ఆక్రోశానికి అందరి ఆమోదం ఉండదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News